Doctor Punches Patient: ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఓ డాక్టర్ విచక్షణ మరిచి ప్రవర్తించాడు. పేషెంట్ తలపై కొట్టాడు. ఈ ఘటన చైనాలో 2019లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఓ సర్జన్ 82 ఏళ్ల వృద్ధురాలికి సర్జరీ చేస్తూ, ఆమె తలపై మూడుసార్లు కొట్టాడు. ఈ ఘటనపై ప్రస్తుతం చైనా అధికారలుు దర్యాప్తు చేస్తున్నారు.
చైనాకి చెందిన వైద్యుడు ఐ ఫెన్ డిసెంబర్ 2019లో శస్త్రచికిత్స చేస్తూ పేషెంట్‌పై దాడి చేసిన ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఆమె కళ్లకు ఆపరేషన్ చేస్తూ మధ్యలో పేషెంట్ తలపై కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన తర్వాత సదరు ఆస్పత్రి వైద్యుడితో పాటు ఆస్పత్రి సీఈఓను తొలగించింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చైనా నైరుతి నగరమైన గుయిగాంగ్ లోని ఎయిర్ చైనా ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. సర్జరీ సమయంలో లోకల్ అనస్థీషియా కారణంగా, రోగి అసహనంగా ఉంది, తన తలను కదల్చడంతో పాటు కనుబొమ్మలను చాలా సార్లు కదిలింది. రోగి స్థానిక చైనా భాష మాత్రమే తెలియడంతో, వైద్యుడు చెప్పినట్లుగా ప్రతిస్పందించలేదు. దీంతో కోపంతో డాక్టర్ సదరు పేషెంట్ తలపై కొట్టాడు. రోగి నుదిటిపై గాయాలు అయినట్లు స్థానిక అధికారులు చెప్పారు. ఆపరేషన్ తర్వాత సదరు ఆస్పత్రి క్షమాపనలు చెప్పింది. పరిహారం కింద 500 యువాన్లు(70 డాలర్లు) చెల్లించిందని రోగి కుమారుడు చెప్పారు.