China Spy Balloon: అమెరికా, చైనాల మధ్య స్పై బెలూన్ వివాదం నడుస్తూనే ఉంది. చైనా బెలూన్ సాయంతో పలు దేశాలపై గూఢచర్యం చేసినట్లు అమెరికా ఆరోపిస్తోంది. చైనా ఆర్మీ ఏకంగా బెలూన్ ప్లీట్ ను నిర్వహిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా బెలూన్ కనిపించింది. దీన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ కూల్చేసింది. దీనిపై ప్రస్తుతం అక్కడి అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. బెలూన్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని సేకరించారు, ఏ శాటిలైట్ తో ఈ బెలూన్ కనెక్ట్ అయి ఉందనే వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.
Read Also: SSLV D2: కౌంట్‌డౌన్ షురూ.. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎస్ఎల్వీ-డీ2
ఇదిలా ఉంటే చైనా ఈ బెలూన్ల సహాయంతో 5 ఖండాల్లో 40 దేశాలపై నిగా పెట్టినట్లు అమెరికన్ అధికారి వెల్లడించారు. బెలూన్ తయారీదారులు చైనా సైన్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారని యూఎస్ఏ భావిస్తోంది. అయితే చైనా మాత్రం వాతావరణ పరిశోధన కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకుంది. అమెరికా ఆరోపణలను చైనా తోసిపుచ్చుతోంది.
చైనా స్పై బెలూన్లు కమ్యూనికేషన్ సిగ్నల్స్ ని సేకరించగలిగేదిగా ఉందని..కూల్చేసిన బెలూన్ ఏకంగా 60 మీటర్ల పొడవుతో ఓ విమానం కలిగి ఉండే పేలోడ్ కలిగి ఉందని, సమాచారం బదిలీకి యాంటెన్నాలు, పవర్ ఉత్పత్తికి సోలార్ ప్లేట్స్ కలిగి ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. భారత్, జపాన్ తో పాటు యూఎస్ఏపై చైనా నిఘా పెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించింది. ప్రతీ ఒక్కరితోనూ గొడవ పడే దేశంగా చైనా తయారైందని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆరోపించాడు. ఇది ఆ దేశ ప్రజలకు మంచిది కాదని హితవు పలికారు.