China Locks Down Parts Of Wuhan As Covid Cases Emerge: కరోనా వైరస్ పుట్టినిల్లు వూహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. వుహాన్‌లోని హన్‌యాంగ్ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో.. అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ కొనసాగనున్నాయి. అప్పటివవరకూ పరిస్థితులు అదుపులోకి వస్తే పర్లేదు. అలా కాకుండా కేసులు పెరిగితే మాత్రం.. తదుపరి కొనసాగింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఒక్క హన్‌యాంగ్ జిల్లాలోనే కాదు.. 10 లక్షల జనాభా గల జియాంగ్‌షియా జిల్లాలో కూడా కొన్ని రోజుల క్రితమే లాక్‌డౌన్ విధించారు. షాషి ప్రావిన్సులోని డాటొంగ్ నగరంతోపాటు గువాంగ్‌ఝువాలో కూడా కొవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
నిజానికి.. తాము 2020 ఏప్రిల్ నాటికే కరోనా వైరస్‌ని నిర్మూలించామని చైనా పేర్కొంది. అలాగే.. కరోనా ఆంక్షల్ని రద్దు చేసింది. కానీ.. క్రమంగా అక్కడ మళ్లీ కేసులు పెరుగుతూ వచ్చాయి. మధ్యలో పలుసార్లు లాక్‌డౌన్ విధించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు బయటపడుతున్న తరుణంలో.. వూహాన్‌తో పాటు చైనాలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్ని అమల్లోకి తెచ్చారు. ఓవైపు ఇతర దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూనే, దాంతో కలిసి జీవించే విధానాన్ని అబలంభిస్తున్నాయి. కానీ.. చైనా మాత్రం జీరో-కొవిడ్ వ్యూహాన్ని పాటిస్తోంది. ఒక్క కేసు వచ్చినా లక్షల సంఖ్యలో పరీక్షలు నిర్వహించడమే కాకుండా క్వారంటైన్ నిబంధనలు విధిస్తోంది. ఈ కఠిన నిబంధనల మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా.. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మాత్రం వాటిని పెడచెవిన పెడుతూ, తమ విధానాన్ని సమర్థించుకుంటున్నాడు. కరోనా పూర్తిగా నిర్మూలించాలంటే, కఠిన నిబంధనలు తప్పవని పేర్కొంటున్నాడు.