India at UN: భారతదేశం మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) నిర్మాణంపై నిలదీసింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి, రుచిరా కాంబోజ్ భద్రతా మండలి యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. ఐదు దేశాలు ఇతర దేశాలను ఇతరుల కన్నా ఎక్కువ చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి అందర్ని కలుపుకుపోవడం లేదని చెప్పింది. యూఎన్ లో ప్రపంచ శాంతి కోసం జరిగిన బహిరంగ చర్చ సందర్భంగా కాంబోజ్ మాట్లాడారు.
Read Also: Cyclone Mocha: రాష్ట్రానికి ముంచుకొస్తున్న ‘మోచా’ తుపాను ముప్పు.. ఆందోళనలో రైతులు
ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి శాశ్వత సభ్యదేశాల హోదా లేదని భారత్ మరోమారు ప్రస్తావించింది. యూఎన్ అసమానతలను తొలగిస్తుందా..? లేదా వాటిని అలాగే శాశ్వతంగా ఉంచుతుందా..? అని ప్రశ్నించింది. భద్రతా మండలిలో దశాబ్ధాలుగా సంస్కరణలు చేయలేదని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యూఎన్ కౌన్సిల్ విశ్వసనీయతను మెరుగుపరచగలమా..? అని రుచికా కాంబోజ్ ప్రశ్నించారు. మొత్తం ప్రపంచానికి యూఎన్ నాయకత్వం అందించే సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందించాలంటే కౌన్సిల్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింతగా ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ కోరింది. వాయిస్ లేని వారికి వాయిస్ ఇస్తేనే సమర్థవంతమైన పరిష్కారాలను అందిగలమని భారత్ తరుపున రుచికా కాంబోజ్ అన్నారు.
ఐక్యరాజ్యసమితి ఏర్పడి నాటి నుంచి శాశ్వత సభ్యదేశాలుగా చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకేలు ఉన్నాయి. ఈ 5 దేశాలు మాత్రమే వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. మరో 10 దేశాలు ప్రతీ రెండేళ్ల కాలానికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఉంటాయి. గత కొన్నేళ్లుగా భారతదేశానికి శాశ్వత సభ్యదేశం హోదా కల్పించాలని కోరుతోంది. ఇదే విధంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లోని దేశాలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించేలా భద్రతా మండలిని సంస్కరించాలని కోరుతోంది. జర్మనీ, ఇండియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాలకు శాశ్వత సభ్యదేశాల హోదా కల్పించాలనే డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇండియాకు శాశ్వత సభ్యదేశ హోదా ఇచ్చేందుకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే సమ్మతించినా.. డ్రాగన్ కంట్రీ చైనా పలు సందర్భాల్లో మోకాలడ్డుతోంది.