తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది.. బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, వృద్ధుల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్నవారు, మృతుల సంఖ్య పెరగడం.. వైద్యవ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది. మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఇవన్నీ కలిసి కరోనా వ్యాప్తికి ఊతం ఇచ్చాయి. రెండు వారాలుగా 35 నుంచి 40 వేల మధ్య నమోదైన రోజువారీ కేసులు.. సోమవారం 50 వేలకు చేరువయ్యాయి. వేసవికాలం నుంచి తరచుగా రోజుకు 100కు పైగా మరణాలు వెలుగుచూస్తున్నాయి. మొత్తం మరణాల సంఖ్య లక్షా 38 వేలకు చేరింది.
ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. పాజిటివ్ కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో నమోదవుతోన్న కరోనా కేసులే ప్రస్తుత ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో పాఠశాలకు వెళ్తోన్న విద్యార్థుల్లో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉంది. అలాగే మాస్క్‌లు తప్పనిసరి కాదు. అయితే కేసులు పెరిగితే విద్యార్థులు మాస్కులు ధరించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. బ్రిటన్ ప్రధానంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాపైనే ఆధారపడింది. అలాగే ఈ దేశం ముందుగా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంతో టీకా యాంటీబాడీలు కనుమరుగయ్యే అవకాశం ఉందన్న ప్రశ్నలూ తలెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు 41 శాతం మంది బూస్టర్ డోసుల్ని స్వీకరించారు. అయితే, ఫాలోఅప్ కార్యక్రమంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.