తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో ఈసారి ప్రధాని కార్యాలయం మీద ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు.
దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు లంక సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలో అది చేయండని, అవసరమైతే కనిపిస్తే కాల్చివేయండని కూడా సైన్యానికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనీయనని రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని ఆయన చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు శ్రీలంక పోలీసులు, సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘే స్పష్టం చేశారు.
శ్రీలంకలో పరిస్థితులు ఏ స్థాయికి చేరుకున్నాయంటే నిరసనకారులు నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయ ప్రాంగణంలోకి గుంపులుగా చేరుకుని, ఆ భవనం ఎక్కి శ్రీలంక దేశ పతాకాన్ని ఎగురవేశారు. గొటబాయ రాజీనామా విషయంపై అబేయవర్థెన మాట్లాడుతూ.. గొటబాయ తనకు ఫోన్ చేశారని, చెప్పినట్టుగానే తాను బుధవారం రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను పంపిస్తానని చెప్పారని తెలిపారు. జులై 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని, అప్పటివరకూ దేశ పౌరులు సంయమనం పాటించాలని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ అభ్యర్థించారు.
Srilanka Crisis: టీవీ ఛానల్‌లోకి దూసుకెళ్లిన ఆందోళన కారులు.. ప్రత్యక్షప్రసారాలు నిలిపివేత
సుమారు 2 కోట్ల 10 లక్షల జనాభా ఉన్న శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ పాలనతోనే సర్వనాశనం అయ్యిందన్న వైఖరితో ఉన్న అక్కడి ప్రజలు.. రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పోరాడుతున్నారు.