ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వైద్యవిద్యను అభ్యసించే భారతీయ విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. యుద్ధంతో అతలాకుతలం అవుతున్న దేశం నుంచి బయటపడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. వీరిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అపరేషన్ గంగా నిర్వహిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్‌ఎంసీ నిబంధనలు సడలించింది.
ఇప్పటికే కొన్ని వేలమంది మెడిసిన్ చదువుతోన్న విద్యార్థులు భారత్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే, ప్రాణాలతో బయటపడి వచ్చినప్పటికీ అక్కడ నెలకొన్న సంక్షోభం కారణంగా మెడిసిన్ చదువు మధ్యలో ఆగిపోతుందనే ఆందోళనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే ప్రయత్నం చేసింది భారత్. నేషనల్ మెడిసిన్ కమిషన్ కొన్ని నిబంధనలను సడలించింది. అందులో భాగంగా ఇంటర్న్ షిప్ అసంపూర్తిగా వున్న విద్యార్ధులు దానిని భారత్ లో పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ వార్ సందర్భంగా FMGE నిబంధనలు పాటించినవారికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇంటర్న్ షిప్ పూర్తిచేసుకునే సదుపాయం కల్పించింది.
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్- 2021 నిబంధనల ప్రకారం, విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థులు కోర్సు, శిక్షణ, ఇంటర్న్‌షిప్ కూడా అక్కడే పూర్తిచేయాలి. ప్రాథమికంగా వైద్యవిద్య ఎక్కడ అవుతుందో మిగతావీ అక్కడే పూర్తి చేయాల్సి వుంటుంది. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం మెడిసిన్ మధ్యలో స్వదేశానికి వచ్చి ఇక్కడ కోర్సు పూర్తి చేసేందుకు ప్రస్తుత నిబంధనలు అనుకూలించేవి కావు. తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు సడలించడంతో వైద్యవిద్యార్ధులకు ఊరట లభించింది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో కోర్సు పూర్తయ్యేందుకు వెసులుబాటు కల్పించే అంశాలను భారత్ సమీక్షించింది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. మరో రెండేళ్లు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. భారత్‌లోని ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ కోర్సుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే ప్రతిఏటా వేల మంది మెడిసిన్ ఔత్సాహికులు భారత్ నుంచి ఉక్రెయిన్‌కు తరలివెళ్తుంటారు. యుద్ధం నేపథ్యంలో విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఈ నిర్ణయం పన్నీటి జల్లు కానుంది.