Russia: రష్యాకు వ్యతిరేకంగా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అక్కడి ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్ కి ఎదురుతిరిగారు. ఆ సంస్థ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ రష్యాలో మిలిటరీ పాలనను గద్దె దించుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే ప్రస్తుతం బెలారస్ మధ్యవర్తిత్వంతో ఈ తిరుగుబాటు ముగిసింది. ప్రిగోజిన్ రష్యాను వదిలి బెలారస్ కి పయణమయ్యాడు. ఇదిలా ఉంటే రష్యాకు తిరుగుబాట్లు కొత్త కాదు. అంతకుముందు రెండుసార్లు పెద్ద తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.
1991 తిరుగుబాటు:
ఆగష్టు 1991లో, సోవియట్ యూనియన్ పతనానికి నాలుగు నెలల ముందు తిరుగుబాటు జరిగింది. అయితే ఈ తిరుగుబాటు విఫలమైంది. యూఎస్ఎస్ఆర్ 15 రిపబ్లిక్ లకు స్వయం ప్రతిపత్తి మంజూరు చేయాలని అప్పటి అధ్యక్షుడు మిఖాయిల్ గుర్బచేవ్ అనుకున్నారు. అయితే కరుడుగట్టిన కమ్యూనిస్టులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారు. గోర్బచేవ్ క్రిమియాలో ఉన్నప్పుడు, రష్యన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కేజీబీ అతడిని అదుపులోకి తీసుకుంది. మాస్కో వీధుల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు, ట్యాంకులు మోహరించబడ్డాయి.
అయితే మూడు రోజుల తర్వాత ఈ చర్యను రష్యా ప్రజలు వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. పోరాటానికి బోరిస్ యెల్ట్సిన్ నాయకత్వం వహించాడు. పార్లమెంటును చుట్టుముట్టిన ట్యాంకు పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రెండు రోజుల్లోనే ఈ తిరుగుబాటు ముగిసింది. గోర్బచేవ్ మాస్కోకు తిరిగి వచ్చారు. అయితే ఈ తిరుగుబాటు అతడిని బలహీనపరిచింది. ఆయన స్థానంలో యెల్ట్సిన్ రష్యా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. కొన్ని నెలల్లోనే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై, స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి.
Read Also: PM Modi: ఎమర్జెన్సీ చీకటి రోజులు.. మరిచిపోలేని కాలం అంటూ ప్రధాని ట్వీట్..
1993 పార్లమెంటరీ తిరుగుబాటు:
1991 తిరుగుబాటు తర్వాత , సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యాగా ఏర్పడింది. అయితే రెండేళ్ల తరువాత 1993 సెప్టెంబర్ 21 మరియు అక్టోబరు 4 మధ్య మరో తిరుగుబాటును రష్యా చవిచూసింది. కరడుగట్టిన కమ్యూనిస్టులు, జాతీయవాదులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. పార్లమెంట్ పై ట్యాంకుల దాడితో ఈ తిరుగుబాటు ముగిసింది. నెలల తరబడి రాజకీయ ప్రతిష్టంభన కొనసాగింది. సుప్రీం సోవియట్ ను రద్దు చేయాలనే డిక్రీపై యెల్ట్సిన్ సంతకం చేసిన తర్వాత పార్లమెంట్ ను సమావేశపరిచారు.
ఇది కమ్యూనిస్ట్ ఆధిపత్య పార్లమెంట్ లో ప్రతిష్టంభన ఏర్పరిచింది. యెల్ట్సిన్ ను నాయకుడిగా తొలగించి, ప్రతిపక్షంలో చేరిన వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ రూట్ స్కోయ్ కి అధ్యక్షుడి అధికారాలు ఇవ్వాలని సభ ఓటేసింది. పార్లమెంట్ మద్దతుదారులు, రెబెల్ ఎంపీలతో చేరి పార్లమెంట్ లోనే ఉండీ నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ బయట యెల్ట్సిన్ ప్రత్యర్థులు పార్లమెంట్ బయట ప్రదర్శనలు చేశారు. వీరు మాస్కో మేయర్ కార్యాలయాన్ని, స్టేట్ టెలివిజన్ సెంటర్ లో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెల్ట్సిన్ చివరికి అక్టోబర్ 4న వైట్ హౌస్‌పై కాల్పులు జరపాలని ట్యాంకులు మరియు దళాలను ఆదేశించడం ద్వారా తిరుగుబాటును అణిచివేశాడు. ఈ తిరుగుబాటులో మొత్తం 1000 మంది చనిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికార రికార్డుల ప్రకారం 148 మంది మాత్రమే మరణించినట్లు ఉంది.