‘బ్యాట్‌మాన్: ది లాంగ్ హాలోవీన్’ కామిక్ ఆర్టిస్ట్ టిమ్ సేల్(66) గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన పలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన మృతికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
డీసీ కామిక్స్ యొక్క అధికారిక ట్విటర్ ఖాతా ప్రఖ్యాత కళాకారుడు టిమ్ సేల్‌కు నివాళులర్పించింది. టిమ్ సేల్ ‘గ్రౌండ్ బ్రేకింగ్ పేజీ డిజైన్‌లు’, కామిక్ పుస్తకాలు ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాయని ప్రశంసించింది. “టిమ్ సేల్ ఒక అద్భుతమైన కళాకారుడు. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అతని అద్భుతమైన పేజీ డిజైన్‌లు, కామిక్ పుస్తక కథలు ఈ తరం ఆలోచనలనే మార్చేశాయి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
డిసి కామిక్స్ పబ్లిషర్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ జిమ్ లీ కూడా టిమ్ సేల్ మరణంపై ఒక ప్రకటన విడుదల చేశారు. అతను ఓ అద్భుతమైన కళాకారుడని ప్రశంసించారు. టిమ్ మరణం డీసీ కుటుంబాన్ని కలచివేసిందన్నారు. అతడు కథలు చెప్పడంతో పాటు ప్యానెల్ లేఅవుట్, కంపోజిషన్‌లో సిద్ధహస్తుడని కొనియాడారు. ఆయన పని నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు జిమ్ లీ కితాబిచ్చారు.