Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారుల్ని దేశవ్యాప్తంగా వేటాడేందుకు ‘‘ఆపరేషన్ డెవిల్ హంట్’’ని ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా అస్థిరత, ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా అవామీలీగ్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తుందనే భయంతో వారిని అణిచివేసే ప్రయత్నంలో యూనస్ ఉన్నారు.
బంగ్లాదేశ్ భద్రతా దళాలు దేశవ్యాప్తంగా 1308 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశాయి. గత వారం గాజీపూర్ లో మాజీ అవామీ లీగ్ మంత్రి ఇంటిపై దాడి చేసిన సందర్భంలో విద్యార్థి కార్యకర్తలపై ప్రతిదాడి జరిగింది. ఆ తర్వాత శనివారం నుంచి ఈ ఆపరేషన్‌ని ప్రారంభించేందుకు మహ్మద్ యూనస్ ఆదేశాలు జారీ చేశారు. సైన్యం, పోలీసులు, ప్రత్యేక విభాగాలు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మెట్రోపాలిటన్ ప్రాంతాల నుంచి కనీసం 274 మందిని, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మరో 1034 మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
ఈ ఆపరేషన్ కింద అరెస్ట్ చేయబడిన వ్యక్తుల్లో ఎక్కువ మంది అవామీలీగ్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలే ఉన్నారు. గాజీఫూర్‌లో అవామీ లీగ్‌కి చెందిన 81 మంది నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. కమిల్లాలో షేక్ హసీనా పార్టీకి చెందిన మరో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోఖాలిలో ని హతియా సబ్ డిస్ట్రిక్ట్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రైడ్స్‌లో యూనియన్ పరిషత్ చైర్మన్‌తో పాటు ఏడుగురు అవామీ లీగ్ నాయకుల్ని అరెస్ట్ చేశారు.
Read Also: Viral: ఇండియా-పాక్ మధ్య కొన్ని రోజుల్లో మ్యాచ్.. గొడవ పడ్డ హర్భజన్, అక్తర్.. (వీడియో)
ఈ ఆపరేషన్‌పై బంగ్లా ఏం చెబుతోంది..?
దేశవ్యాప్తంగా అశాంతిని అరికట్టడం, ప్రజా భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శనివారం ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ అనే ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. షేక్ హసీనా అవాలీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు విద్యార్థులపై దాడులు తీవ్రం చేసిన తర్వాత ఆ ఆపరేషన్ ప్రారంభమైంది. దీని గురించి ఆ దేశ హోంశాఖ అడ్వైజర్ ఎండీ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ.. దెయ్యాలను న్యాయం ముందు నిలబెట్టాలి, ఒక్క దెయ్యాన్ని కూడా వదిలపెట్టకూడదని షేక్ హసీనా మద్దతుదారుల గురించి వ్యాఖ్యానించాడు.
ఆదివారం తరువాత, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ కార్యదర్శి నసిముల్ ఘని మాట్లాడుతూ, ఆపరేషన్ అవసరమైనంత కాలం కొనసాగుతుందని అన్నారు. “దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్న ప్రాంతాలను తటస్థీకరించడం మా లక్ష్యం” అని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ కోసం ఢాకలో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు.