Britan: బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మూడు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓటమి పాలయింది. బ్రిటన్‌లో రిషి సునాక్ నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం మూడు పార్లమెంట్ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల పార్టీ ఓటమి పాలైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బే-అయిన్‌స్టీ సీటులో లేబర్ పార్టీ గెలుపొందింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. మరో స్థానమైన సోమర్టన్-ఫ్రోమ్‌ను లిబరల్ డెమోక్రటిక్ పార్టీ గెలుచుకొంది. కన్జర్వేటివ్ పార్టీ ఉక్స్‌బ్రిడ్జ్-సౌత్ రూయిస్లిప్ సీటును మాత్రం దక్కించుకొంది. గతంలో ఇది బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గెలిచిన స్థానం. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ అధికార పార్టీ గతంలో కంటే బలపడింది. ఈ ఫలితాల నేపథ్యంలో సునాక్ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఓటమితో వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి పెనుసవాళ్లను తీసుకురానున్నాయి. సునాక్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లో పార్టీ నాయకులు పలు వివాదాలు, కుంభకోణాల్లో చిక్కుకున్నారు. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ఒత్తిడి వంటివి పార్టీ పాపులారిటీని తీవ్రంగా దెబ్బతీశాయి.
Read also: Super Man: సూపర్ మ్యాన్ అనుకుని స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకిన చిన్నారి
ప్రస్తుత ఉప ఎన్నికల ఫలితాలను చూసిన విశ్లేషకులు వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో కెయిర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ నుంచి అధికార పక్షానికి గట్టిపోటీ తప్పదని చెబుతున్నారు. 2025లో బ్రిటన్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఓటర్లు పోలింగ్‌కు పెద్దగా మొగ్గు చూపని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్రిటన్‌లో దాదాపు 65శాతం మంది ఓటర్లు సునాక్‌కు ప్రతికూలంగా ఉండగా.. 25శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నట్లు ఇటీవల సర్వే పేర్కొంది. ‘యూ గవ్ పోల్’ పేరిట నిర్వహించిన సర్వేలో దాదాపు 2,151 మంది బ్రిటన్ వాసుల అభిప్రాయాలను సేకరించారు. ఆయనపై ఉన్న సానుకూల దృక్పథం దాదాపు 40శాతం తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఇక గత నెలతో పోల్చుకొంటే 6 శాతం తగ్గినట్టు సర్వేలో తేలింది.