Attack on Hindu Temple in bangladesh: బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ మతఛాందసవాదులు తరుచుగా హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. ప్రధాని షేక్ హసీనా మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉంటామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో అత్యంత పురాతనమైన హిందూ ఆలయంపై దాడి చేశారు దుండగులు. దేవీ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
బంగ్లాదేశ్ లోని జునైదా జిల్లాలోని దౌతియా గ్రామంలో కాళీ ఆలయంపై దాడి చేసి.. విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆలయ ప్రాంగణం నుంచి కిలోమీటర్ దూరంలో విగ్రహ ముక్కలను పడేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు సుకుమార్ కుంటను వెల్లడించారు. ఈ కాళీ ఆలయం అవిభక్త భారతదేశంలో పురాతన ఆలయంగా ఉంది. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున పూజలు జరిగేవి.
Read Also: Mohan Bhagwat: వర్ణం, జాతి భావనలను అంతా గతం.. మరిచిపోవాలి.
బంగ్లాదేశ్ లో 10 రోజు పాటు దుర్గా పూజ ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జునైడా లోని ఆలయంలో రాత్రి ఘటన జరిగిందని బంగ్లాదేశ్ పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చందనాథ్ పొద్దార్ తెలిపారు. 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి సంఘటను జరగలేదని.. ఆలయంపై దాడి దురదృష్టకరమైన సంఘటన అని ఆయన అన్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టామని జిల్లా ఎస్పీ అమిత్ కుమార్ బర్మన్ తెలిపారు. ఈ ఒక్క సంఘటన మినహాయిస్తే బంగ్లాదేశ్ వ్యాప్తంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రశాంతంగా జరిగాయి.
గతేడాది దుర్గా నవరాత్రుల్లో ఏర్పడిన మతఘర్షణల్లో ఆరుగురు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ముస్లిం మెజారిటీ అయిన బంగ్లాదేశ్ లో మొత్తం 16.9 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 10 శాతం హిందువులు ఉన్నారు.