Pakistan: పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికే, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భారతదేశంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులు, ముస్లింలు వేరు అంటూ, కాశ్మీర్ తన జీవనాడి అంటూ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజులకు, పమల్గామ్‌లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు, ఆసిమ్ మునీర్ దారిలోనే పాక్ ఆర్మీ అధికారులు నడుస్తున్నారు.
తాజాగా, పాక్ ఆర్మీ ప్రతినిధి జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత ప్రభుత్వం, సైన్యంపై విష ప్రచారం చేశారు. ఇటీవల జర్మన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాక్ ఆర్మీ మీడియా విభాగం-ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం, భారత సాయుధ దళాలు రాడికల్ హిందుత్వ శక్తుల ఆధిపత్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరారు.
Read Also: Americans Oppose Trump: పాపం ట్రంప్.. అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేక స్వరం
అతను మాట్లాడుతూ.. భారత సైన్యం సహా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, రాడికల్ హిందుత్వ భావజాలంతో ఎక్కువగా ప్రభావితమయ్యాయని, ఇది మొత్తం దేశాన్ని ఆక్రమించిందని ఆరోపించారు. కాశ్మీర్ సమస్య వల్ల రెండు అణ్వాయుధ దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదని చెప్పారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి భారత్ నిధులు ఇస్తోందని, పాక్‌లో ప్రస్తుతం ఉద్రిక్తతలకు భారత్ లోని తీవ్ర హిందుత్వ భావజాలం మరో కారణమని ఆరోపించారు.
బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాల్లో తిరుగుబాటుదారులకు న్యూఢిల్లీ సహకరిస్తోందని, నిధులు ఇస్తోందని అన్నారు. పాక్‌లో జరుగుతున్న ప్రతీ ఉగ్రవా సంఘటన వెనక భారత్ ఉందని, అంతర్జాతీయ సమాజానికి పాక్ ఆధారాలు అందించిందని చెప్పారు. భారతదేశంలో మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను హింసించే కేసులు పెరిగాయని, కాశ్మీర్‌లో భారతదేశం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. “కాశ్మీర్‌లో పది లక్షలకు పైగా భారత భద్రతా సిబ్బందిని మోహరించారు. ఏ ఇంటినైనా ఎప్పుడైనా సోదా చేయవచ్చు. అక్కడ ఏమి జరుగుతుందో ఇది చూపిస్తుంది.” అని అన్నారు.