అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు జూన్‌లో మునీర్ అమెరికాలో పర్యటించాడు. వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. ఇక రెండు నెలల వ్యవధిలో మరోసారి అసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడు.
అయితే జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఓ కార్యక్రమంలో మునీర్ ప్రసంగిస్తూ భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి. వ్యాపారవేత్త, గౌరవ కాన్సుల్ అద్నాన్ అసద్.. ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన బ్లాక్-టై విందుకు మునీర్ హాజరై మాట్లాడాడు. ప్రసంగమంతా ఆద్యంతం భారత్‌ను లక్ష్యంగా చేసుకునే మాట్లాడినట్లు సమాచారం.
సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని.. సింధు నదిపై భారతదేశం పెత్తనం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని బెదిరించాడు. భారతదేశం ఆనకట్టు నిర్మించేంత వరకు వేచి చూస్తామని.. ఆ తర్వాత 10 క్షిపణులతో నాశనం చేస్తామని హెచ్చరించాడు. ఈ సందర్భంగా భారత్‌ను మెర్సిడెస్‌తో.. పాకిస్థాన్‌ను డంప్ ట్రక్కుతో పోల్చాడు. భారతదేశం ఫెరారీ లాంటి హైవేపై వస్తున్న మెర్సిడెస్ కారు లాంటిది.. మనం కంకరతో నిండిన డంప్ ట్రక్కులాంటివారమని పేర్కొన్నాడు. ట్రక్కు.. కారును ఢీకొడితే ఏం జరుగుతుందో తెలిసిందే కదా? నష్టపోయేది ఎవరో మీకు తెలుసు కదా? అని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు.
ఇది కూడా చదవండి: Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి
పాకిస్థాన్ అణ్వాయుధ దేశమని.. మనం పతనమవుతున్నామనుకుంటే మనతో పాటు సగం ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తామన్నారు. ఈసారి భారతదేశం నుంచి ముప్పు ఎదురైతే మాత్రం ఇస్లామాబాద్ సగం ప్రపంచాన్ని నాశనం చేస్తోందని అగ్ర రాజ్యం అమెరికా వేదికగా భారత్‌ను మునీర్ హెచ్చరించాడు.
అసిమ్ మునీర్.. జూన్‌లో ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించాడు. పర్యటనలో భాగంగా వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇచ్చిన విందుకు హాజరయ్యాడు. ఈ విందులో చమురు ఒప్పందంతో పాటు అమెరికా-పాకిస్థాన్ సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నిరోధంలో పాకిస్థాన్ అద్భుత భాగస్వామిని అని అమెరికా జనరల్ వర్ణించడం విశేషం. ఇక పర్యటనలో భాగంగా అమెరికా రాజకీయ, సైనిక నాయకులను కూడా కలిశారు. అమెరికా సీనియర్ రాజకీయ, సైనిక ప్రముఖులతో పాటు పాకిస్థాన్ డయాస్పోరా సభ్యులతో కూడా సమావేశమయ్యారు.
ఇది కూడా చదవండి: KC Venugopal: భయంకర విషాదాన్ని తృటిలో తప్పించుకున్నాం.. అదృష్టమే కాపాడింది!
ఇక టంపాలో యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి కూడా మునీర్ హాజరయ్యాడు. అలాగే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఇక ఈ సందర్భంగా అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మైఖేల్ కురిల్లా ప్రసంశించారు. ఈ కార్యక్రమంలోనే కెనడాలో సిక్కు నాయకుడి హత్య, ఖతార్‌లో ఎనిమిది మంది భారతీయ నావికాదళ అధికారుల అరెస్ట్, కులభూషణ్ జాదవ్ కేసులను మునీర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఉగ్రవాదంలో భారత్ ప్రమేయం ఉందనే దానికి తిరుగులేని ఆధారాలు ఉన్నట్లుగా మునీర్ పేర్కొ్న్నట్లు సమాచారం.
అమెరికా వేదికగా మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారతదేశం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడేమో అణు బెదిరింపులు చేస్తున్నాడు. దీనిపై భారతప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
