America Reacts On Narendra Modi Vladimir Putin Phone Call: ఈ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే! ఈ పరిణామాలపై తాజాగా అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమన్న మోడీ వ్యాఖ్యల్ని స్వాగతిస్తామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. ‘‘మోడీ మాటల్ని మేం పరిగణనలోకి తీసుకుంటాం. ఒకవేళ ఆయన సూచనలు ఆచరణలోకి అమలైతే.. అప్పుడు మేం వాటిని స్వాగతిస్తాం. రష్యాతో ఒప్పందాలపై ఇతర దేశాలు తమ సొంత నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ, యుద్ధం ప్రభావాన్ని తగ్గించేందుకు మేం మిత్రదేశాలతో సమన్వయం కొనసాగిస్తాం’’ ఆయన పటేల్ తెలిపారు. యుద్ధాన్ని ముగించి, శాంతి స్థాపనకు పాటుపడాలనే చూసే ఏ దేశమైనా.. ఉక్రెయిన్ మిత్ర దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
కాగా.. పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోడీ, ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు చర్చలు, దౌత్య ప్రక్రియలే మార్గమని పునరుద్ఘాటించారు. మోడీ అభ్యర్థన మేరకు.. ఉక్రెయిన్ విషయంలో రష్యా ప్రాథమిక అంచనాలు ఏమిటన్నది మోడీకి పుతిన్ వివరించినట్లు అధికారల వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు దేశాధినేతల మధ్య ఈ ఏడాదిలో ఐదుసార్లు టెలిఫోన్ సంభాషణలు నడిచాయి. మొదట్లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించినప్పుడు.. పుతిన్‌కి మోడీ ఫోన్ చేశారు. ఆ సమయంలో యుద్ధం గురించి ఇద్దరి మధ్య చర్చలు నడిచాయి. ఫోన్ చేసినప్పుడల్లా.. చర్చలు, దౌత్య ప్రక్రియలతోనే ఈ యుద్ధం ముగించాలని మోడీ పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కంద్‌లో పుతిన్‌ని కలిసినప్పుడు.. ఇది యుద్ధాల యుగం కాదని మోడీ హితవు పలికారు.