Amazon Lays Off: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలతో వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది చివరి నుంచి ప్రారంభం అయిన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ వీడియో గేమ్ విభాగం 100 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ గేమ్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ హార్ట్ మాన్ ఈ మేరకు ఓ మెమో జారీ చేశారు. తొలగించిన ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ఇతర ప్రయోజనాలను అందిస్తామని వెల్లడించారు. గతేడాది అమెజాన్ సంస్థ ఏకంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించింది. అదనంగా మరో 9000 మందిని తొలగించనున్నట్లు గతంలో అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ వెల్లడించారు. టెలిహెల్త్ సర్వీస్ తో పాటు మరికొన్ని సేవలను అమెజాన్ మూసేసింది.
Read Also: Software Employee Case: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు
ఆర్థిక మాంద్యం భయాలు, యాడ్స్ రెవెన్యూ తగ్గడంతో పలు ఐటీ కంపనీల ఆదాయంపై ప్రభావం చూపించాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ప్రకారం 2022 ప్రారంభం నుంచి 2,80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తొలిరౌండ్ లో 11,000 మందిని తొలిగిస్తే, మరో విడతలో 10,000 మంది ఉద్యోగులను బయటకు పంపింది. గూగుల్ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది.