మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా.. ముస్లీం దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పాలని ఖతార్ కోరిన సంగతి తెలిసిందే! ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా ఆ వ్యాఖ్యలకు భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఆ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని (నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్) హతమారుస్తామని చెప్పడమే కాదు.. దేశవ్యాప్తంగా ఆత్మాహుది దాడులకు పాల్పడుతామని వార్నింగ్ ఇచ్చింది.
ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌లలో తాము దాడులకు దిగుతామంటూ ఈ నెల 6వ తేదీన(జూన్ 6న) అల్‌ఖైదా ఓ లేఖ విడుదల చేసింది. ‘‘మేము, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల్లోని కాషాయ ఉగ్రవాదులు చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని ఆ సంస్థ హెచ్చరించింది. ఇదే సమయంలో.. ఎంజీహెచ్ అనే మరో ఉగ్రవాద సంస్థ సైతం నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలి. అలా చేయకపోతే, ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఉగ్రవాద సంస్థల నుంచి ఈ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో.. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా.. ఎయిర్‌పోర్ట్స్, మెట్రో, రైల్వే స్టేషన్స్, మార్కెట్లలో ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానాస్పద యాక్టివిటీలు ఏమైనా కనిపిస్తే, వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా డిపార్ట్‌మెంట్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఏజెన్సీ వెల్లడించింది.