Acid attack on minority girl in Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ, క్రిష్టియన్ యువతులను బలవంతంగా అపహరించి, మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయిలనే కాదు, పెళ్లై బిడ్డలు ఉన్న మహిళలను కూడా అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్సుల్లో ఈ రకమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఉదంతం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మైనారిటీ యువతిపై యాసిడ్ దాడి జరిగింది.
Read Also: Pakistan: మీరు టర్కీ రావాల్సిన అవసరం లేదు.. పాక్ ప్రధానికి ఘోర అవమానం..
కరాచీ నగరంలో నివాసం ఉంటున్న క్రైస్తవ యువతి సునీత మహీమ్ అనే 19 ఏళ్ల యువతిపై కమ్రాన్ అల్లా బక్ష్ అనే ముస్లిం యువకుడు యాసిడ్ తో దాడి చేశారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఫిబ్రవరి 1న కరాచీలోని ఫ్రీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సునీత మసీమ్ స్థానిక మసూమ్ షా కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటోంది. కమ్రాన్ ఆమె ఇంటి పొరుగునే ఉంటున్నాడు. ఫిబ్రవరి 1న వేరే పనిపై సునీత కరాచీలోని కాలాపుల్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో కంటోన్మెంట్ ఏరియాలో బస్ ఎక్కే సమయంలో సునీతపై కమ్రాన్ యాసిడ్ తో దాడి చేశాడు.
దాడి అనంతర అక్కడి నుంచి కమ్రాన్ పరారయ్యాడు. ఈ దాడిలో సునీత శరీరం 20 శాతం కాలింది. ముఖం, కాళ్లు, కళ్లపై తీవ్రగాయాలు అయ్యాయి. గత కొంత కాలంగా క్రిస్టియానిటీని వదిలి ఇస్లాంలోకి మారాలని కమ్రాన్, సునీతపై ఒత్తడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సునీత కుటుంబ సభ్యులు, కమ్రాన్ కుటుంబ సభ్యులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. అయితే తాను క్రిష్టియానిటీని వదిలిపెట్టనని.. పెళ్లి చేసుకోనని చెప్పడంతో నిందితుడు యువతిపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని సునీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.