సైన్స్ డెవలప్ అయి కొన్ని వందల ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ విశ్వం అంతుపట్టని స్థితిలోనే ఉంది. ఇప్పటివరకు మనం ఈ విశ్వం గురించి తెలుసుకుంది సముద్రంలో నీటి బొట్టంతే. మన సౌర వ్యవస్థకు మూలం అయిన సూర్యుడి గురించే ఇంకా అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సూర్యుడిపై ఏర్పడే సన్ స్పాట్స్, సౌర తుఫానులు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా సూర్యుడిపై ఏర్పడిన ఓ ‘‘సన్ స్పాట్’’ ప్రత్యేకంగా మారింది. ఏఆర్3038 అనే సన్ స్పాట్ భూమి కన్నా 2.5 రెట్ల పరిమాణంలో పెరిగింది. కేవలం 24 గంటల్లోనే ఇది దాని వ్యాసం, పరిమాణాన్ని రెట్టింపు చేసుకుంది. ఇది భూమికి ఎదురుగా ఉంది.
తాజాగా సూర్యుడిపై ఏర్పడిన సన్ స్పాట్ వ్యాసం దాదాపుగా 31,900 కిలోమీటర్లు ఉంది. దీని పరిమాణం జూన్ 19తో పోలిస్తే జూన్ 20 నాటికి పెరిగింది. ఈ విషయాన్ని భూ అయస్కాంత తుఫానులు, సౌర తుఫానులు, విశ్వానికి సంబంధించిన విషయాలను వెల్లడించే స్పెస్ వెదర్.కామ్ వెబ్ సైట్ వెల్లడించింది.
సూర్యుడిపై ఉండే చీకటి ప్రాంతాలను సన్ స్పాట్ లుగా పిలుస్తారు. ఇవి బలమైన అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉంటాయి. ఇక్కడి నుంచే సోలార్ ప్లేర్స్ ఏర్పడుతుంటాయి. సూర్యుడి ప్లాస్మా నుంచి బలమైన ఎలక్ట్రిక్ ఛార్జెస్ విడుదలవుతుంటాయి. బలమైన అయస్కాంత క్షేత్రాలు శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ లకు కారణం అవుతాయి.
ఏఆర్ 3038 సన్ స్పాట్ అస్థిరమైన బీటా-గామా అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉందని, ఇది ఎం-క్లాస్ సన్ స్పాట్ గా వర్గీకరించారు సైంటిస్టులు. ఇది సూర్యుడి ఉత్తరాన ఉంది. ఈ సన్ స్పాట్ల నుంచి వెలువడే కిరణాలు, శక్తి వల్ల భూమిపై రేడియో బ్లాక్ అవుట్ లు ఏర్పడుతుంటాయి. సూర్యుడి నుంచి విడుదలయ్యే ఆవేశపూరిత కణాల వల్ల శాటిలైట్లు, కమ్యూనికేషన్, విద్యుత్ గ్రిడ్స్ కు ప్రమాదం ఏర్పడుతుంటుంది.