7 Year Old Boy In US Found Dead Inside Washing Machine: అమెరికాలోని టెక్సాస్‌లో ఓ దారుణం చోటు చేసుకుంది. వాషింగ్ మెషీన్‌లో పడి, ట్రాయ్ కోహ్లర్ అనే ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. అయితే.. బాలుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్ మెషీన్‌లో పడి ఆ బాలుడు చనిపోయాడా? లేక అతడ్ని చంపి, మృతదేహాన్ని అక్కడ ఉంచారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తొలుత తమ అబ్బాయి కనిపించడం లేదని ట్రాయ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికొచ్చిన అతని తల్లి.. ఇంట్లో కొడుకు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికింది. తెలిసిన వారిని సంప్రదించింది. కానీ.. ఎక్కడా జాడ కనిపించకపోయే సరికి, పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే వారి ఇంట్లోనూ సెర్చింగ్ నిర్వహించారు. అప్పుడే.. గారేజ్‌లో ఉండే వాషింగ్ మెషీన్‌లో ట్రాయ్ మృతదేహం లభ్యమైంది. విచారణలో భాగంగానే.. ట్రాయ్ వారి సొంత కొడుకు కాదన్న విషయం వెలుగులోకి వచ్చింది. 2019లో అతడ్ని దత్తత తీసుకున్నట్టు తెలిసింది. మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ అబ్బాయి కనిపించకుడా పోయినప్పుడు, అతని తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. అతడు మిస్ అయిన రెండు, మూడు గంటల తర్వాత కేసు నమోదైంది. అందుకే, పోలీసులు బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్ మెషీన్‌లో బాలుడి మృతదేహం బట్టతో కప్పబడి ఉండటం, ఆ అనుమానాలకి మరింత బలం చేకూరుస్తోంది. అయితే.. ఇది హత్యనా? లేక బాలుడు అనుకోకుండా వాషింగ్ మెషీన్‌లో పడి చనిపోయాడా? అనేది ఇప్పుడే నిర్ధారించలేమని పోలీసులు చెప్తున్నారు. ఇంతవరకూ చార్జెస్ గానీ, అరెస్టులు గానీ జరగలేదన్నారు. ప్రస్తుతం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తోందని, త్వరలోనే దీన్ని ఛేదిస్తామని అధికారులు వెల్లడించారు.