Pak train hijack: పాకిస్తాన్‌కి బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. బలూచిస్తాన్ క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ని హైజాక్ చేశారు. ట్రైన్‌లో మొత్తం 400+ ప్రయాణికులు ఉంటే, 200 మందిని బీఎల్ఏ బందీలుగా చేసుకుంది. ఇదిలా ఉంటే, పాక్ సైన్యం తమపై చేసిన దాడికి ప్రతిస్పందనగా 50 మంది బందీలను ఉరితీసినట్లు బీఎల్ఏ ప్రకటించింది. సైనిక చర్య విరమించుకుని, బలూచ్ ఖైదీలను విడుదల చేయడం ద్వారా మిగిలిన బందీలను రక్షించుకోవచ్చుని, పాకిస్తాన్‌కి మరో 20 గంటల సమయం ఉందని హెచ్చరించింది.
Read Also: Pak train hijack: వందలాది ‘‘శవపేటికలు’’ సిద్ధం చేస్తున్న పాకిస్తాన్.. క్వెట్టాకు తరలింపు..
‘‘నిన్న రాత్రి(మంగళవారం) రాత్రి జరిగిన పాక్ డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా, 10 మంది శత్రు సిబ్బందిని చంపేశాం. నేటి ఘర్షణల్లో మరో 10 మంది పాక్ సైనికుల్ని హతమార్చాం. నిన్న జరిగిన పోరాటంలో మరో 30 మంది మరణించారు. దీంతో శత్రు సిబ్బంది సంఖ్య 100కి పైగా పెరిగింది. అయితే, దాదాపుగా 150 మంది బందీలు బీఎల్ఏ అదుపులో ఉన్నారు’’అని బీఎల్ఏ తిరుగుబాటుదారులు తమ తాజా ప్రకటనలో తెలిపారు. ఒకవేళ పాక్ సైన్యం మరోసారి ఆపరేషన్ ప్రారంభిస్తే బందీలందర్ని వెంటనే చంపేస్తామని హెచ్చరించింది.
“పాకిస్తాన్ కు ఇప్పుడు కేవలం 20 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలోపు ఖైదీల మార్పిడికి సంబంధించి నిర్దిష్ట చర్యలు తీసుకోకపోతే, ప్రతి గంట గడిచేకొద్దీ, బలూచ్ జాతీయ కోర్టు మరిన్ని బందీలను విచారించి, తదనుగుణంగా చంపేస్తాం” అని ప్రకటనలో పేర్కొంది. బీఎల్ఏ అదుపులో పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, ఫ్రాంటియర్ కార్ప్స్, ఇతర భద్రతా దళాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. మంగళవారం హైజాక్ చేసిన కొన్ని గంటలకే, తమ వారిని జైలు నుంచి విడుదల చేయాలని బీఎల్ఏ పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. 24 గంటల్లో స్పందించకపోతే, ‘‘దేశ దురాగతాలు, వలసవాద ఆక్రమణ, మారణహోమం, దోపిడి, బలూచిస్తాన్‌లో యుద్ధనేరాలలో పాల్గొనడం’’ కింద విచారిస్తామని తిరుగుబాటుదారులు ఈ రోజు తెల్లవారుజామున ప్రకటించారు.