Amazon Rainforest: ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవి, ప్రపంచానికి ఊపిరితిత్తుల్లా పనిచేస్తున్న చెట్లతో నిండి ఉన్న అమెజాన్ వర్షారణ్య అటవీ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమికి అవసమయ్యే ఆక్సిజన్ ఎక్కువగా ఈ అడవుల్లో నుంచే వస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతపెద్దగా ఉంటుంది ఈ అమెజాన్ ఫారెస్ట్. తాజాగా అమెజాన్ అడవిలో అత్యంత పురాతనమైన నగరాన్ని పరిశోధకులు కనుగొనడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.
సుమారుగా 2000 ఏళ్ల క్రితం వేల మంది జనాలతో విలసిల్లిన నగరం ఇప్పుడు మరుగున పడిపోయింది. దీనిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ దేశంలోని అమెజాన్ అడవిలో ఈ నగరాన్ని కనుగొన్నట్లు ది జర్నల్ సైన్స్ పత్రిక వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి 20 ఏళ్ల క్రితం ఇక్కడ మట్టిదిబ్బలు, పూడుకుపోయిన రోడ్లను స్టీఫెన్ రోస్టైన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అయితే, ఇంత పెద్ద నగరం ఇక్కడ ఉంటుందని ఊహించలేదు. 2015లో ఈ ప్రాంతాన్ని లైడార్ సర్వే సాయంతో విశ్లేషించారు. తాజాగా దీనికి సంబంధించిన ఫలితాలను ప్రచురించారు.
Read Also: Ram Mandir inauguration: అయోధ్యలో 5 రెట్లు పెరిగిన హోటల్ రూం ధరలు.. 80 శాతం బుక్..
ఈ నగరానికి సంబంధించిన అనేక విషయాలను శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకప్పుడు ఇక్కడ రోడ్ కనెక్టవిటీ ఉన్నట్లు గుర్తించారు. 500 బీసీ నుంచి 300-600 ఏడీ వరకు ఉపానో ప్రజలు ఇక్కడ జీవించి ఉన్నట్లు భావిస్తున్నారు. స్థానిక మట్టి దిబ్బలపై 6000 ఇళ్లు నిర్మించి ఉండగా.. వాటి చుట్టూ వ్యవసాయ క్షేత్రాలు ఉండేవని, ఈ ప్రాంతంలో 33 అడుగుల వెడల్పు రోడ్లు.. 20 కిలోమీటర్ల పొడవు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ నగరంలో కనీసం 10,000-30,000 మంది ఇక్కడ నివసించే వారని ఆంటోనే డోరిసన్ అనే సైంటిస్టు అంచనా వేశారు. ఈ ప్రాంతంలో మొత్తం ఐదు జనావాసాలు ఉండొచ్చని, ఇళ్లను చెక్కతో నిర్మించారని శాస్త్రవేత్తలు అంచానా వేస్తున్నారు. దాదాపుగా 1000 ఏళ్ల క్రితం ఈ నగరం అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది.