పెరూలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. 100 మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది.
ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా 20 మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా అతి వేగం, రోడ్లు సరిగా లేకపోవడం, ప్రమాద సూచికలు లేకపోవడంతో ఇటీవల పెరూలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది నవంబర్‌లో ఉత్తర పెరువియన్ అటవీ ప్రాంతంలో మినీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది మృతిచెందారు. రెండు నెలలు గడవక ముందే మరో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.