ఇక యుద్ధం ముగిసింది అని ప్రకటించిన తాలిబన్లు.. ఆ తర్వాత తమ ప్రకటనకు విరుద్ధంగా డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహిస్తూ అందరనీ ఆశ్చర్య పరిచారు.. మరోవైపు.. ఇప్పుడు దాదాపు 150 మందిని కిడ్నాప్ చేసి మరింత రెచ్చిపోయారు. కాబూల్ సైతం తాలిబన్ల వశం కావడంతో.. భారత్ సహా చాలా దేశాలు.. ఆఫ్ఘన్‌లోని రాయబార కార్యాలయాలను ఖాళీ చేసి.. స్వదేశాలకు తరలిపోయాయి. ఖాళీగా ఉన్న కార్యాలయాల్లోకి చొర్రబడి దౌత్యపత్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని తాలిబన్లు తనిఖీలు కూడా నిర్వహించారు. ఏమీ దొరకకపోవడంతో.. అక్కడ ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, తాజాగా కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర 150 మందిని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది.. వీరిలో ఎక్కువమంది భారతీయులు ఉన్నట్టుగా సమాచారం.. కాబూల్ నుంచి బాధితులను స్వదేశాలకు తరలించేందుకు సిద్ధమైన సమయంలో.. తాలిబన్లు ఈ చర్యకు పాల్పడినట్టుగా ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. కిడ్నాప్ వార్తల్ని తాలిబన్ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు.