Pakistan: పాకిస్తాన్‌లో శనివారం భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని రైల్వే స్టేషన్‌లో బాంబు పేలి 26 మంది మరణించారు. పాకిస్తాన్ ఆర్మీ సైనికులే లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన 26 మందిలో 14 మంది సైనికులు ఉన్నారు. క్వెట్టా స్టేషన్ నుంచి పెషావర్‌కి ఈ రోజు ఉదయం రైలు బయలుదేరే ముందు ఈ పేలుడు సంభవించింది. పేలుకు సంబంధించిన వీడియోలో, ఫోటోలు వైరల్‌గా మారాయి.
Read Also: Asaduddin Owaisi: పీఎం మోడీ అరబ్ దేశాలకు వెళ్తే ఇలాగే మాట్లాడుతారా..? ఓవైసీ విమర్శలు..
అయితే, ఈ పేలుడు తమ పనే అని ‘‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)’’ ప్రకటించింది. పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు చెప్పింది. క్వెట్టా రైల్వే స్టేషన్‌లోని పాకిస్తాన్ ఆర్మీ యూనిట్‌పై దాడి చేసినట్లు ఒక ప్రకటనలో బీఎల్‌ఏ ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఇటీవల కాలంలో ఈ సంస్థ పాక్ ఆర్మీతో పాటు, చైనీయులు లక్ష్యంగా దాడులు చేస్తోంది.
ముఖ్యంగా బలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సుని కలుపుతూ సిపెక్ ప్రాజెక్ట్ చేపడుతోంది చైనా. ఈ ప్రాజెక్టులో పనిచేస్తే చైనీయులతో పాటు దానికి రక్షణగా నిలుస్తున్న పాక్ ఆర్మీ, పోలీసులపై బీఎల్ఏ విరుచుకుపడుతోంది. తమ బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు చైనా సహజ వనరుల్ని కొల్లగొడుతోందని బీఎల్ఏ ప్రధాన ఆరోపణ.