Asaduddin Owaisi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అక్కడ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రధాని మోడీ అరబ్ దేశాలకు వెళ్లిన సమయంలో ఇదే భాషను ఉపయోగిస్తారా..? అని ప్రశ్నించారు. మహరాష్ట్రలో రైతు ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలపై అధికార పార్టీ దృష్టి మళ్లించిందని ఆరోపించారు.
ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నవంబర్ 20న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ జైశ్వాల్, శివసేన(యూబీటీ)కి చెందిన బాలా సాహెబ్ థోరట్‌తో ఎంఐఎం అభ్యర్థి నాజర్ సిద్ధిఖీ తలపడుతున్నారు. “ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రంలో ‘ఓటు జిహాద్’ గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రధాని (నరేంద్ర మోదీ) అరబ్ దేశాలను సందర్శించినప్పుడు వారు అదే భాషను ఉపయోగిస్తున్నారా” అని ఓవైసీ అడిగారు.
Read Also: Tuvalu : ఈ దేశానికి భూమిపై నూకలు చెల్లాయి.. సముద్రంలో మునిగిపోనున్న తొలి డిజిటల్ కంట్రీ
ఔరంగాబాద్ డివిజన్‌లో 324 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయితే దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదని అన్నారు. బదులుగా ఫడ్నవీస్ ఓటు జిహాద్ గురించి మాట్లాడుతున్నారని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఓవైసీ విమర్శించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరాఠాలు, ముస్లింలు, దళితులు ఐక్యంగా ఉండాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల కాంగ్రెస్, శివసేన ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలను లక్ష్యంగా చేసుకుని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు చేశారు. మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో 14 స్థానాల్లో ‘ఓట్ జిహాద్’ కనిపించిందని ఫడ్నవీస్ అన్నారు. ధూలే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి 5 సెగ్మెంట్లలో 1.9 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని, అయితే మాలేగావ్ సెంట్రల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓఒ వర్గం వారు ఒకే వైపు ఓట్లు వేయడంతో, బీజేపీ అభ్యర్థి 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారని అన్నారు. దీనికి ఓట్ జిహాద్ కారణమని చెప్పారు.