Pakistan: పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతోంది. 13 ఏళ్ల బాలుడు పెళ్లి చేస్తేనే తాను చదువుకుంటానని బెదిరించడంతో అతని పేరెంట్స్ ఒప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం అబ్బాయి, అమ్మాయికి ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోలు, వీడియోలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల్ని విమర్శిస్తున్నారు.
13 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల బాలిక పెళ్లి చేసుకోబోతున్నారనే ఆశ్చర్యకరమైన న్యూస్ పాకిస్తాన్ నుంచి వచ్చింది. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బాలుడు తనకు పెళ్లి చేస్తేనే చదువుకుంటానని అతని తల్లిదండ్రులకు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అబ్బాయి, అమ్మాయి కుటుంబాలు అంగీకారానికి వచ్చి అంగరంగ వైభవంగా నిశ్చితార్థాన్ని నిర్వహించారు.
Reviewit.pk ప్రకారం.. ఈ నిశ్చితార్థ వేడుకల్లో ఇద్దరు పిల్లల తల్లులను మీడియా ప్రశ్నించగా.. తమ నిర్ణయం సరైనందే అని చెప్పారు. తనకు 16 ఏళ్ల వయసులోనే వివాహం జరిగినట్లు బాలిక తల్లి చెప్పింది. అదే విధంగా 25 ఏళ్లకు తనకు వివాహం జరిగినట్లు బాలుడి తల్లి చెప్పింది. చిన్న వయసులో కొడుకు పెళ్లి చేయాలనే నిర్ణయాన్ని ఆ తల్లి సమర్థించడం గమనార్హం.
దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఇందుకే దేశం నాశనమైపోతుందని, కనీసం చదువుకోవాలని, ఈ పని చేసిన తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని రాసుకొచ్చారు. మరోకరు తండ్రి పరిస్థితి విషమంగా ఉండటంతో తండ్రి సంతోషం కోసం ఈ వేడుక నిర్వహించినట్లు మరొకరు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
నిజానికి పాకిస్తాన్‌లో కనీస వివాహ వయసు మగవారికి 18 ఏళ్లు, ఆడవారికి 16 ఏళ్లు. సింధ్ ప్రావిన్సులో 2013లో స్రీ-పురుషులకు కనీస వివాహ వయసు 18 ఏళ్లకు పెంచుతూ చట్టాన్ని రూపొందించారు. అయితే, అది ఇప్పటికీ అమలు కాలేదు. అంతర్జాతీయంగా మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది.