ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా ఆంక్షలను లెక్కచేయడంలేదు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కూడా గౌరవించడంలేదు. న్యాయస్థానం తీర్పును తాము పరిగణలోకి తీసుకోవడంలేదంటూ రష్యా ప్రకటించింది. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధానికి ముగింపు అని స్పష్టంచేసింది. ఉక్రెయిన్ పై దాడులను రష్యా మరింత ఉద్ధృతం చేసింది. నగరాల్లో నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులతో విరుచుకుపడుతోంది. విధ్యంసం చేస్తోంది. పోలండ్ సరిహద్దులకు అత్యంత చేరువగా ఉన్న లీవ్ నగరం ఇప్పటివరకు పెద్దగా రష్యా దాడులకు గురి కాలేదు. దీంతో ఇతర ప్రాంతాలనుంచి వలస వెళ్లే వారిలో చాలామంది ఈ నగరంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే రష్యాబలగాలు ఈ నగరాన్నీ వదిలిపెట్టడం లేదు.
Read Also: Telangana: మహిళపై వీఆర్‌ఏ అత్యాచారయత్నం.. అడ్డుకున్న భర్తపై దాడి
గత నెల 24న రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఉక్రెయిన్‌నుంచి పొరుగు దేశమైన పోలాండ్‌లోకి వచ్చిన శరణార్థుల సంఖ్య 20 లక్షలు దాటింది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. పోలాండ్ బోర్డర్ గార్డ్ ఈ విషయాన్ని తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 816 మంది పౌరులు మృతి చెందారని, మరో 1,333 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం వెల్లడించింది. ఉక్రెయిన్ అధికారులపై మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఉక్రెయిన్ సహకరించడంలేదన్నారు. ఉక్రెయిన్ అధికారులే శాంతి చర్చలు జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలంటే చైనా, అమెరికా చేతులు కలపాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆకాంక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న పరిణామాలను ఎవ్వరూ కోరుకోరని, ఈ పరిణామాలతో ఎవరికీ ప్రయోజనం కూడా లేదని స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా రష్యాలో చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నాడు టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్. వారి విద్యకు బాసటగా నిలుస్తానని చెప్పాడు. తన పౌండేషన్ ద్వారా దాదాపు నాలుగు కోట్ల సాయాన్ని అందిస్తానని ప్రకటించాడు.