Pakistan: పాకిస్తాన్‌పై మరోసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వాయువ్య ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరానికి సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది పోలీసులు చనిపోయినట్లు సంబంధిత వర్గాలు వెళ్లడించాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ‘తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్’ గ్రూప్ ప్రకటించింది. గురువారం ఈ దాడి జరిగింది. సీనియర్ పోలీస్ అధికారులు దాడిని ధ్రువీకరించారు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు అవుట్‌పోస్ట్‌లోకి చొరబడి బోర్డర్ కాస్టబులరీ సెక్యూరిటీ ఫోర్స్ సభ్యుల్ని చంపారు.
Read Also: Maldives: భారత్ దెబ్బతో మల్దీవులు కుదేలు.. అధ్యక్షుడి జీతం దానం.. ఉద్యోగుల శాలరీల్లో కోత!
సీనియర్ తాలిబాన్ నాయకుడు ఉస్తాద్ ఖురేషీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు పాక్ తాలిబాన్లు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని బజౌర్ జిల్లాలో, ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారంతో పాక్ ఆర్మీ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఖురేషీతో పాటు తొమ్మిది మంది మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో ఉగ్రవాదంతో, దక్షిణాన బలూచిస్తాన్‌లో వేర్పాటువాదంతో పాకిస్తాన్ పోరాడుతోంది. వాయువ్యంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాకిస్తాన్ తాలిబాన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తరుచుగా వీరు పాక్ ఆర్మీ, పోలీసులు టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. మరోవైపు బలూచిస్తాన్‌కి స్వాతంత్య్రం కావాలని ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాకిస్తాన్ భద్రతా బలగాలు టార్గెట్‌గా దాడులు చేస్తోంది.