ఖమ్మం: పాలేరు అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శనివారం పాలేరులోని కుసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ‘అధికారులు నా జ్ఞానేంద్రియాలు వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం జరగదు. అలాగే అధికారులు కూడా ఎటువంటి రూపాయి ఆశించకుండా ప్రజల పనులు నెరవేర్చాలి. ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం జరగదు వారి పద్ధతి మార్చుకొని విధులు నిర్వహించాలి.
అలా జరగకపోతే వారి అంతట వారే వెళ్లే విధంగా కనుసైగల తోటే జరుపుతా. నా పరిపాలనలో మాటలు ఉండవు కను సైగలు మాత్రమే. ఎన్ని శక్తులు ఎదురైన, ఎన్ని కుట్రలు పన్నినా మీ అందరి దీవెనలతో గెలిచాను. ఎన్నికల సమయంలో అనేక గ్రామాల్లో ఇచ్చిన వాగ్దానాలు త్వరలోనే పూర్తి చేస్తా. అనేక మంది ధరణితో ఇబ్బందులు పడుతున్నారు. నమ్ముకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా. ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు తీసుకొని వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను నెరవేర్చుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో మంత్రుల అద్వర్యం లో ప్రతి గ్యారెంటీ అమలు చేస్తాం. గతంలో కొంతమంది అనేక కేసులు పెట్టారు.వాటన్నింటినీ పరిష్కరిస్తాను. ఆరు గ్యారెంటీ లను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పాము.
రెండు మూడు రోజుల్లో తీపి వార్త వింటారు. ఆరు కోట్ల డెబ్బై ఒక్క లక్షల కోట్ల అప్పులు చేసింది గత ప్రభుత్వం. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం81 వేల కోట్ల అప్పులు చేసి ఒప్పచెప్పింది. ఎన్ని అప్పులు మా నెత్తిన పెట్టిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గతంలో ఆగి పోయిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించాం. ఏ ఒక్క అధికారికి డబ్బులు తీసుకుని పోస్టింగ్ లు ఇవ్వం. ప్రజల నుంచి అధికారులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేయాలి. నన్ను నమ్ముకున్న ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోను. ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులు కలిసి పనిచేయాలి. ఎన్నికల వరకే రాజకీయాలు, మేము కానీ మా పార్టీ నాయకులు కక్ష పూరిత చర్యలకు పాల్పడం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.