Explainer: హైదరాబాద్‌లో బతకలేమా? ప్రపంచంలోనే చివరి నుంచి రెండో స్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Least Climate Resilient Cities: చల్లని గాలికి, చెరువుల నీటికి, ముసురుకొచ్చే వానకు పేరున్న హైదరాబాద్… ఈ మధ్యకాలంలో ఎండకు అల్లాడుతోంది. వర్షం వస్తే రోడ్ల మీద నీరు నిలుస్తోంది. ఒక్కసారిగా కురిసే భారీ వాన నగర ప్రయాణాన్ని గంటల తరబడి నిలిపేస్తోంది. ఒకప్పుడు అసాధారణంగా అనిపించిన తీవ్రమైన వేడి, ఆకస్మిక వరదలు… ఇప్పుడు నగర జీవితంలోనే భాగమైపోతున్నాయి. ఇవి కేవలం వాతావరణంలో వచ్చిన చిన్న చిన్న మార్పులేనా? లేదా హైదరాబాద్ తనకు తెలియకుండానే మరింత ప్రమాదకరమైన భవిష్యత్తు వైపు నడుస్తోందా?
ప్రపంచంలోని 72 ప్రధాన నగరాలపై జరిగిన ఓ కొత్త అంచనా… ఈ ప్రశ్నకు ఆందోళన కలిగించే సమాధానం ఇచ్చింది. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంలో ప్రపంచంలోని దారుణమైన స్థితిలో ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది.
మొత్తం 72 నగరాల జాబితాలో… హైదరాబాద్ చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. దాని కంటే ప్రమాదకరమైన స్థితిలో అహ్మదాబాద్ నిలిచింది. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాతావరణ మార్పుల వల్ల ముప్పు ఎదురయ్యే నగరం కావడం ఒక విషయం.. ఆ ముప్పు వచ్చినప్పుడు తన ప్రజలను కాపాడుకునే సామర్థ్యం లేకపోవడం మరో విషయం. ఆ రెండింటినీ కలిపే పదమే వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యం. అంటే నగరంలో ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్నది మాత్రమే కాదు… ఆ వేడిని ప్రజలు తట్టుకునేలా విద్యుత్ వ్యవస్థ ఉందా? నీటి సరఫరా సురక్షితంగా ఉందా? భారీ వర్షం పడితే వరద నీటిని వేగంగా బయటకు పంపే డ్రైనేజీ వ్యవస్థ ఉందా? ముందుగానే ప్రజలను హెచ్చరించే వ్యవస్థ ఉందా? విపత్తు వచ్చిన తర్వాత నగరం ఎంత వేగంగా కోలుకోగలదు? ఇవన్నీ కలిపి ఒక నగరం వాతావరణ మార్పులకు ఎంత సిద్ధంగా ఉందో చెబుతాయి.
Also Read
భౌగోళిక సమాచారాన్ని, కృత్రిమ మేధస్సును ఉపయోగించే ఆల్ఫాజియో అనే సంస్థ ఈ అంచనాను రూపొందించింది. హైదరాబాద్ విషయంలో వాళ్లు చూసిన ముప్పుల్లో తీవ్రమైన వేడి, వరదలు, కరువు వంటి వాతావరణ ప్రమాదాలు ఉన్నాయి.
అదే సమయంలో వాటిని ఎదుర్కొనే మౌలిక వసతులు, పాలనా వ్యవస్థ, ముందస్తు హెచ్చరికలు, విధానపరమైన చర్యలు లాంటి అంశాలను కూడా పరిశీలించారు. అంటే… హైదరాబాద్‌కు ప్రమాదం ఎంత ఉందన్నది మాత్రమే వాళ్లు చూడలేదు. ఆ ప్రమాదం వచ్చినప్పుడు హైదరాబాద్ ఎంత బలంగా నిలబడగలదో కూడా చూశారు. అక్కడే ఈ ర్యాంకింగ్ మనల్ని ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే ప్రకృతి మార్పులను మనం ఆపలేం. కానీ ఆ మార్పుల దెబ్బ నగరాన్ని ఎంతగా తాకాలి అన్నది మాత్రం మనం కొంతవరకు నిర్ణయించగలం.
అమెరికాలోని చికాగో ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత వాతావరణ తట్టుకునే ప్రధాన నగరంగా నిలిచింది. అక్కడ కూడా వర్షాలు పడతాయి. వరద ముప్పు ఉంటుంది. వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుంది. కానీ వాటిని ఎదుర్కొనేందుకు నగరం ముందుగానే వ్యవస్థలను నిర్మించుకుంది. వరదలను నియంత్రించడానికి భారీ భూగర్భ సొరంగ వ్యవస్థను నిర్మించింది.
నీటిని నిల్వ చేసి, ఒక్కసారిగా నగరంపై పడే ఒత్తిడిని తగ్గించే మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఒక భారీ వర్షం పడుతుంది. నిమిషాల్లో రోడ్లపై నీరు చేరుతుంది. రాకపోకలు ఆగిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు వస్తుంది. ట్రాఫిక్ నిలిచిపోతుంది. విద్యుత్ సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో మరో వైపు తీవ్రమైన ఎండ.. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. నీటి అవసరం పెరుగుతుంది. నగరంలోని ప్రతి కాంక్రీట్ నిర్మాణం వేడిని తిరిగి వెదజల్లుతుంది. రాత్రయినా ఉక్కపోత తగ్గదు. ఇలాంటి పరిస్థితులు మరింత తరచుగా, మరింత తీవ్రంగా మారితే? అప్పుడు సమస్య కేవలం వాతావరణానికే పరిమితం కాకుండా అనేక ప్రశ్నలు ముందుకువస్తాయి.
అసలు నగరాన్ని ఎలా నిర్మించారు? చెరువులు, నాలాలు, నీటి ప్రవాహ మార్గాలు ఎంతవరకు మిగిలాయి? వర్షపు నీటిని నగరం ఎంత వేగంగా బయటకు పంపగలదు? వేడి పెరిగినప్పుడు విద్యుత్, నీటి వ్యవస్థలు ఎంత ఒత్తిడిని తట్టుకోగలవు? అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఎంత వేగంగా రక్షించగలుగుతాం?
ఈ ప్రశ్నలన్నీ ఒకదానితో ఒకటి కలుస్తాయి. అందుకే హైదరాబాద్‌కు వచ్చిన ఈ స్థానం… నగరానికి వచ్చిన ఓ హెచ్చరికగా చెప్పవచ్చు. దక్షిణాసియాలోని ఎన్నో నగరాలు ఈ జాబితాలో దిగువ స్థానాల్లో ఉండటం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఢాకా, లాహోర్, కోల్‌కతా, కరాచీ, చిట్టగాంగ్ లాంటి నగరాలూ అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. ఇక ఆల్ఫాజియో వ్యవస్థాపకుడు పరాగ్ ఖన్నా చెప్పిన ఓ మాట ఈ మొత్తం కథకు అద్దంలా నిలుస్తుంది. మనిషి ప్రకృతికి ఎదురుగా నిలిచినప్పుడు… అతని శక్తి ఎంత చిన్నదో మనం తరచూ మర్చిపోతుంటాం. వాతావరణ మార్పులు వేగంగా పెరిగే కొద్దీ… భారీ వర్షాల నీరు లోయల వైపు, నదుల వైపు, సహజ నీటి ప్రవాహ మార్గాల వైపు మరింత వేగంగా చేరుతుంది. కానీ ఆ మార్గాల్లోనే మనుషుల నివాసాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ కూడా ఈ మారుతున్న ప్రపంచంలోనే ఉంది. ఇదే అసలు సమస్య.
ఈ రోజు మనం రోడ్డు మీద ఎదుర్కొంటున్న చిన్న వరద… రేపటి పెద్ద ప్రమాదానికి సంకేతమే అవుతుంది. ఈ రోజు మనం భరిస్తున్న తీవ్రమైన వేడి… రేపటి సాధారణ వేసవిగా మారడం ఖాయంగానే కనిపిస్తోంది. భాగ్యనగరం నిజంగానే భాగ్యంగా నిలవాలంటే ప్రకృతిని జయించాల్సిన అవసరం లేదు. ప్రకృతిని అర్థం చేసుకుని, దాని మార్పులకు తగ్గట్టుగా నగరాన్ని మార్చుకోవాలి. లేకపోతే… మనమే నిర్మించుకున్న ఈ మహానగరం, మారుతున్న వాతావరణం ముందు ఎంతకాలం నిలబడగలదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సమయం చాలా దగ్గరలోనే ఉండొచ్చు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
-
Explainer: హైదరాబాద్‌లో బతకలేమా? ప్రపంచంలోనే చివరి నుంచి రెండో స్థానం..
-
iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!