America Student Visa: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలని కలలుగనే భారతీయ విద్యార్థులకు శుభవార్త. గతంలో ఒకసారి స్టూడెంట్(ఎఫ్-1) వీసా రిజెక్ట్ అయినవాళ్లకు అగ్రరాజ్యం మరో అవకాశం కల్పించటం విశేషం. ఈ మేరకు ఇంటర్వ్యూలకు స్లాట్ల కేటాయింపును ఇప్పటికే మొదలుపెట్టింది. ఒక విద్యా సంవత్సరంలో వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైనా అదే అకడమిక్ ఇయర్‌లో మళ్లీ అప్లై చేసుకునేందుకు తాజాగా ఛాన్స్ ఇచ్చింది. అమెరికాలో విద్యా సంవత్సరం ఈమధ్యే ప్రారంభమైంది.
వీసా కోసం ఫ్రెష్ అప్లికేషన్ల సంఖ్య తగ్గటంతో రిజెక్ట్ అయినవాళ్లకు రీఅప్లై చేసుకునేందుకు అమెరికా పచ్చజెండా ఊపింది. కొవిడ్ వల్ల గత రెండు మూడేళ్లుగా యూఎస్.. ఎఫ్-1 వీసాలను లిమిటెడ్‌గా మంజూరు చేసింది. మహమ్మారి విజృంభణ కారణంగా అక్కడికి వెళ్లేందుకు స్టూడెంట్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు కరోనా బాగా తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులు మళ్లీ అమెరికా వైపు ఫోకస్ పెడుతున్నారు. దీంతో వీసాల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నవారికి అమెరికా మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.
ఒక అకడమిక్ ఇయర్‌లో స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయితే మళ్లీ అదే విద్యా సంవత్సరంలో తిరిగి దరఖాస్తు చేసుకోవటంపై గతంలో లిమిట్ పెట్టింది. ఎలిజిబిలిటీ ఉన్నోళ్లు నష్టపోకూడదనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో పేర్కొంది. కానీ ఇప్పుడు తొలిసారి దరఖాస్తు చేస్తున్నవాళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆ పరిమితిని ఎత్తేసింది. లేటెస్టుగా రిజెక్ట్ అయిన అభ్యర్థులు మళ్లీ వీసా ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనుకుంటే ఈ నెలలోనే స్లాట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ స్లాట్లు దొరకనివాళ్లు ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ ఆప్షన్‌నీ వాడుకోవచ్చని వెల్లడించింది. స్లాట్ బుక్ అయినవారిని గతంలో ఇంటర్వ్యూ చేసినవాళ్లు కాకుండా ఇప్పుడు కొత్తవాళ్లు ఇంటర్వ్యూ చేస్తారు. కొవిడ్‌కి ముందు అమెరికా ఇండియాకి 50 నుంచి 60 వేల వరకు ఎఫ్-1 వీసాలను కేటాయించేది. ఈ నెలలో ఇప్పటిదాక దేశం మొత్తమ్మీద దాదాపు 15 వేల స్లాట్లను రిలీజ్ చేశారు.