Nandyal Crime: మద్యం మత్తులో వంద రూపాయల నోటు ఇవ్వలేదని బిచ్చగాడుని బండరాయితో మోది, దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.. నంద్యాలలోని నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ జరిగిన దస్తగిరి అనే బిచ్చగాడి హత్య కేసు మిస్టరీగా మారగా.. ఆ మిస్టరీని ఛేదించారు త్రీ టౌన్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం కొండమాయ పల్లెకు చెందిన దస్తగిరికి ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు వున్నారు. వీరితో గొడవ పడి, నంద్యాలకు వచ్చి, రైల్వే స్టేషన్, నూనెపల్లె, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు దస్తగిరి..
Read Also: India Bangladesh: బంగ్లాదేశ్‌ని దారుణంగా శిక్షించిన మోడీ సర్కార్.. ఏం చేసిందంటే..
అయితే, సిరివేళ్లకు చెందిన రహ్యుం జులాయిగా పని పాట లేకుండా తాగి తిరిగేవాడు. ఈ క్రమంలో నంద్యాలకు వెళ్లి సాయిబాబా నగర్ సెంటర్ లోని వైన్స్ లో తప్పతాగి, అక్కడే పడిపోయాడు. ఇక, రెండు గంటల తర్వాత లేచి, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతానికి వెళ్లాడు.. అర్ధరాత్రి దగ్గర్లోనే నిద్రపోతున్న దస్తగిరిని లేపి, తాగడానికి డబ్బు ఇవ్వమని బెదిరించాడు రహ్యుం. కానీ, దస్తగిరి ఇవ్వకపోవడంతో జేబులో ఉన్న వంద రూపాయల నోటును లాక్కోబోయాడు. దీంతో, ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది.. ఆవేశంతో ఊగిపోయిన రహ్యుం.. బండరాయితో దస్తగిరి తలపై మోది వెళ్లిపోయాడు.. అయితే, తలపై తీవ్రగాయమై అక్కడిక్కడే మృతి చెందాడు దస్తగిరి. ఈ హత్య మిస్టరీగా మారగా.. రంగంలోని దిగిన త్రీటౌన్ పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా రహ్యుంను అరెస్ట్ చేశారు.. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.