మధ్యప్రదేశ్‌లో సినిమా తరహాలో ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 2023లో హత్యకు గురైనట్లు భావించిన మహిళ.. తాజాగా సజీవంగా ప్రత్యక్షమైంది. దీంతో పోలీసులతో పాటు స్థానికులు షాక్‌కు గురయ్యారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను పట్టుకుని జైల్లో వేశారు. వీళ్లంతా రెండేళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నారు. తాజాగా హతురాలు అనబడిన ఆమె ప్రత్యక్షం కావడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
మాండ్సౌర్ జిల్లా గాంధీ సాగర్ ప్రాంతానికి సంబంధించిన లలితా బాయి(35).. 2023, సెప్టెంబర్‌లో కనిపించకుండా పోయింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని రోజుల తర్వాత ట్రక్కు ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటపడింది. అందులో బాధితురాలి తల నలిగిపోయింది. ఆ ఫొటోను బాధితురాలి తండ్రికి చూపించగా.. పుట్టిమచ్చలు.. నల్లటిదారాన్ని బట్టి తమ కుమార్తెగా భావించాడు. మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా స్మశానానికి తీసుకెళ్లి దహనం చేశాడు.
లలితా బాయిను హత్య చేశారంటూ నలుగురిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇమ్రాన్, షారుఖ్, సోను, ఎజాజ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే తాజాగా చనిపోయినట్లు భావించిన లలితా బాయి.. మాండ్సౌర్ జిల్లాలోని తన గ్రామంలో సజీవంగా కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తండ్రి… లలితా బాయిను గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సమాచారం తెలియజేశాడు. ఆమె లలితా బాయిగా ఆఫీసర్ ఇన్‌చార్జ్ తరుణ భరద్వాజ్ ధృవీకరించాడు.
మిస్సింగ్‌పై లలితా బాయిను పోలీసులు ఆరా తీయగా.. షారుఖ్ అనే వ్యక్తి.. భాన్పురాకు తీసుకెళ్లాడని.. అక్కడ రూ.5లక్షలకు అమ్మేసినట్లు పేర్కొంది. రెండో వ్యక్తి కూడా రాజస్థాన్‌లోని కోటకు తీసుకెళ్లినట్లు చెప్పాడు. అక్కడ 18 నెలలు నివసించినట్లు తెలిపింది. అక్కడ నుంచి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చినట్లుగా లలితా బాయి తెలిపింది. తన దగ్గర మొబైల్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయినట్లు పోలీసులకు తెలిపింది. ఏడాదిన్నర తర్వాత పిల్లలను కలిసింది. ఇక తన గుర్తింపును నిర్ధారించడానికి ఆమె ఆధార్ కార్డు, ఓటర్ కార్డులను చూపించగా పోలీసులు ఆమెను లలితా బాయిగా ధృవీకరించారు.
హతురాలు తిరిగి ప్రత్యక్షం కావడంతో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయంపై స్థానిక పోలీసుల నుంచి సమాచారం కోరింది. కోర్టుకు సమాచారం అందిస్తామని ఝబువా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పద్మవిలోచన్ శుక్లా తెలిపారు. ముందుగా లలితా బాయికి వైద్య పరీక్షలు, డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే సాక్షుల వాంగ్మూలాలను కూడా కొత్తగా నమోదు చేస్తామని చెప్పారు. గతంలో సమగ్ర దర్యాప్తు తర్వాతే.. తాము హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ కేసుపై న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.