రోజురోజుకు సమాజంలో ఆడపిల్ల పుట్టాలి అంటేనే భయపడేలా చేస్తున్నారు కొందరు మృగాళ్లు.. ఒకటి కాదు రెండు కాదు నిత్యం ఎక్కడో ఒకచోట ఆడపిల్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు.. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ పబ్ లో మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువకముందే మరో ఘటన వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఇద్దరు యువకులు ట్రాప్ చేసి గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న ఘటన చిలకల గూడ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో హైదరాబాద్ కు వలస వచ్చారు.. ఆయనకు ఇద్దరు
మైనర్ కూతుళ్లు.. ఇద్దరూ ప్రస్తుతం చదువుకుంటున్నారు.. అయితే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇద్దరు వారి ఫోన్ లో సోషల్ మీడియా ను వాడుతుంటారు. అలాగే పెద్ద కూతురుకు ఇన్స్టాగ్రామ్ లో అంబర్ పేట లాల్ బాగ్ కు చెందిన మహ్మద్ నవాజ్ (21) పరిచయమయ్యాడు. ఆ పరిచయం పెరిగి స్నేహంగా మారింది. నిత్యం చాట్ లు, ఫోన్లు చేసుకుంటూ ఉండేవాళ్లు. ఇక ఆ స్నేహంతో ఒక్కసారి కలవాలని చెప్పి ఆమెను రూమ్ కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ ఘటనను వీడియో తీసి ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ వీడియో చూపించి బెదిరించి అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఇక మరోపక్క చిన్న కూతురు కూడా మహ్మద్ ఇంతియాజ్ అహ్మద్ (23) అనే యువకుడి ప్రేమలో పడింది. మాయమాటలు చెప్పి అహ్మద్ ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత కొన్ని రోజులుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇక ఇద్దరు కూతుర్లు ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంటే ఏమైందని తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో వారు నిజం కక్కారు.దీంతో వారు తమ పిల్లలతో కలిసి ఈ నెల 8న చిలకలగూడ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు నిందితులపై ఐపీసీలోని అత్యాచారం సెక్షన్లు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఇద్దరు యువకులు నిందితులని, అంతకుముందు పలుకేసుల్లో వీరు జైలుకు కూడా వెళ్లినట్లు పోలీసులు చెప్పడంతో బాలికలు అవాక్కయ్యారు. అనంతరం బాలికలకు పోలీసులు కౌన్సులింగ్ ఇచ్చి పంపించారు. సోషల్ మీడియా లో అపరిచితులతో పరిచయాలు పెంచుకోవద్దని, ఎవరిపైన అయినా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు.