దేశ వ్యాప్తంగా నిర్భయ ఘటన తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన దిశ హత్య. అర్ధరాత్రి ఒక డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన జరిగి నేటికీ రెండేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో పోలీస్ వారు తీసుకున్న నిర్ణయం ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. నిందితులందరిని ఎన్ కౌంటర్ చేసి పడేశారు. ఆ ఘటన ఇప్పుడు తలచుకున్నా వెన్నులో వణుకుపుట్టక మానదు. అసలు ఆరోజు ఏం జరిగిందో మరోసారి తెలుసుకుందాం.
శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్ గేట్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ దిశ తన పని ముగించుకొని స్కూటీమీద ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యంలో ఆమె స్కూటీ ఆగిపోవడంతో తన చెల్లికి ఫోన్ చేసి భయమేస్తోంది అని చెప్పిన ఆమె తెల్లారి శవంలా కనిపించింది. అయితే ఆమె బైక్ కి ముందుగానే పంచర్ చేసిన నలుగురు దుర్మార్గులు.. ఆమెను హైదరాబాద్ శివారుల్లో షాద్ నగర్ వద్దకు లాకెళ్లి అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన దేశాన్ని కుదిపివేసింది. ఎన్నో వాదనలు వినిపించాయి.. ఎన్నో గొంతులు లేచాయి. ఎన్ని చేసినా ఆ యువతి ప్రాణం తిరిగి రాలేదు.. కానీ, అలాంటి నిందితులు మాత్రం ప్రాణాలతో ఉండకూడదని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను వెతికిమరి కాల్చి పడేశారు. ఈ ఘటన తరువాత ఆడవారికి రక్షణ కల్పిస్తూ దిశా చట్టాన్ని అమలు చేశారు. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి.
ఇకపోతే ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఆ ఘటన తరువాత దిశా అనే చట్టాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం.. కానీ, ఇంకా ఎంతోమంది ఆడవారు కామాంధుల కబంద హస్తాలలో నలిగిపోతూనే ఉన్నారు. నిత్యం కామాంధుల చేతుల్లో ఎవరో ఒకరు బలి అవుతూనే ఉన్నారు. చిన్నా పెద్ద, వావివరుస.. ఆడ,మగా అని తేడా లేదు.. 6 ఏళ్ళ బాలిక నుంచి 60 ఏళ్ళ బామ్మ వరకు రోజు ఎక్కడో చోట లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ కామాంధుల ఆగడాలకు అంతు ఎక్కడ ఉందో తెలియాలి.