Theft Case: రోజురోజుకు హైదరాబాద్ లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. బస్సులో, రైళ్లల్లో ఆగంతకులతో జాగ్రత్త గా ఉండమని ప్రయాణికులకు చెప్తున్నా ఎక్కడో ఓ చోట దుండగులు రకరకాలుగా దోచుకుంటున్నారు. తాజాగా విజయవాడ నుండి హైదరాబాద్ కి ఆర్టీసీ బస్సులో వస్తున్న రామోజీరావు అనే వ్యక్తి వద్ద రూ. 30 లక్షలు కొట్టేశారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన రామోజీరావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్స్ రంగంలో ఉన్న ఒక వ్యక్తి వద్ద పనిచేస్తున్నాడు. మియాపూర్ లో ఒక సైట్ కి అడ్వాన్స్ ఇచ్చి రమ్మని రామోజీరావు కు రూ. 30 లక్షలు ఇచ్చి పంపించాడు యజమాని.
ఇక ఆ డబ్బుతో గతరాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కాడు రామోజీ రావు. అయితే ఉదయం నార్కట్ పల్లి వచ్చాకా బ్యాగ్ చూసుకొంటే డబ్బు కనిపించలేదు. వెంటనే బాధితుడు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసును నార్కట్ పల్లి పోలీసులకు బదిలీ చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు బస్సులో ఉన్న ప్యాసింజర్ల లిస్ట్ లో ఉన్నవారందరిని తనిఖీ చేస్తున్నారు. మరోపక్క డబ్బు కొట్టేసి నాటకం ఆడుతున్నాడేమో అన్న అనుమానం తో రామోజీరావును కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నార్కట్ పల్లి లో బ్యాగ్ పొతే హయత్ నగర్ లో ఎందుకు ఫిర్యాదు చేశావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.