Tamilnadu Bridegroom Arrested For Marrying Minor Girl: కొందరు ప్రబుద్ధులు ఎందుకో ఒక్క పెళ్లితో సంతృప్తి చెందట్లేదు. నచ్చిన ప్రతీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ.. ‘నిత్య పెళ్లికొడుకు’ అవతారాలు ఎత్తుతున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకుంటూ.. మోసాలకు పాల్పడుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కూడా నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే.. నాలుగో పెళ్లి విషయంలో చేసిన తప్పు కారణంగా, అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలోని బోధికులం గ్రామానికి చెందిన సతీష్(38)కి, కొన్ని సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. మొదట్లో ఇద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కానీ.. ఆ తర్వాత చిన్న చిన్న విషయాల్లో మనస్పర్థలు ఏర్పడటం, అవి పెద్దవిగా మారడంతో ఇద్దరు విడిపోయారు.
అలా రేఖకు విడాకులిచ్చిన కొన్ని రోజుల్లోనే లత అనే మరో యువతిని సతీష్ పెళ్లి చేసుకున్నాడు. ఒకవైపు ఆమెతో కాపురం చేస్తుండగానే.. అతనికి మురుగలక్ష్మితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది ప్రేమగా మారడంతో.. లతకు తెలియకుండా మురుగలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అరుప్పుకోటైలో మరో కాపురం పెట్టాడు. అంతటితో మనోడి పెళ్లి కోరిక తీరలేదు. అదే ప్రాంతంలో మేకలు మేపుతున్న ఓ 17 ఏళ్ల యువతితో సతీష్‌కి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి అందంగా ఉండటంతో, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట మాయమాటలు చెప్పి, ఆమెని వలలో వేసుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకుంటే బాగా చూసుకుంటానని నమ్మించాడు. పాపం, అతని మాయమాటలకు పడిపోయి అమ్మాయి ఒప్పుకుంది. దీంతో.. ఆ యువతిని పెళ్లి చేసుకొని, మరో చోట కొత్త కాపురం పెట్టాడు. అయితే.. మేకలు మేపడానికి వెళ్లిన తన కూతురు తిరిగి రాకపోవడం, ఎక్కడా ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆ యువతి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ యువతి ఉళుందూరుపేటలోని సతీష్ సోదరి ఇంట్లో ఉందని గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకొని, ఆమెను రక్షించి, విరుదునగర్‌లోని ఒక ఆశ్రమంలో ఉంచారు. సతీష్ కోసం గాలించగా.. అతడు అరుప్పుకోటై సమీపంలోని పాలవనత్తం ప్రాంతంలో తలదాచుకున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. దాంతో, ఆ ప్రాంతానికి వెళ్లి, సతీష్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మేజర్ కాని యువతిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో.. పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.