Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. మద్యం తాగుతున్న కొడుకుని అడ్డుకున్నందకు తండ్రి హత్యకు గురయ్యాడు. తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. యువకుడు తండ్రి తలపై ఇటుకతో బలంగా కొట్టాడు. దీంతో అతను మరణించాడు. ఈ ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడైన కుమారుడు ప్రయత్నించాడు.
Read Also: Killer Wolf: డ్రోన్ కెమెరాకు చిక్కిన 10 మందిని చంపిన కిల్లర్ తోడేలు..
ఉత్తరప్రదేశ్ పోలీసు సీనియర్ అధికారి జితేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తండ్రి, కొడుకు మధ్య గొడవ జరిగిందని, కన్హయ్య తివారీ అనే వ్యక్తి తన తండ్రిపై దాడి చేసి చంపేశాడు, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరివేసేందుకు ప్రయత్నించాడని చెప్పాడు. తండ్రిపై దాడికి పాల్పడుతున్న వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఇరుగుపొరుగు వారు కూడా ఈ గొడవని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఇటుకతో తండ్రిని చంపేస్తానని అరుస్తూ వెంబడిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ దాడిలో సత్యప్రకాష్ తివారీ మరణించాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్య చేసినందుకు కొడుకు కన్హయ్య తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యప్రకాష్ తివారీ భార్య అంతకుముందే మరణించారు. తన కొడుకుతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఇద్దరూ కూలీ పనులు చేసేవారు. కన్హయ్య తివారీ రోజూ మద్యం సేవించేవాడు. దీంతో తరుచూ ఇంట్లో గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు.