Samarlakota Triple Murder: కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణంగా తెలుస్తోంది. నిందితుడు సురేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అసలు సంబంధం లేని చిన్నారులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి మాధురి, కూతుర్లు పుష్ప కుమారి, జెస్సీలను అతి కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో భర్త లేని సమయంలో ఈ దారుణం జరిగింది.. దానికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు అదే కాలనీకి చెందిన సురేష్ ఈ హత్యలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మాధురికి సురేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. మొదట్లో ఈ వ్యవహారం భర్తకు తెలియకుండా నడిచింది. ఆ తర్వాత ఇరుగుపొరుగు మాటలతో భర్తకు కూడా తెలిసింది. అయినప్పటికీ వాళ్ల వ్యవహారం మాత్రం గుట్టుగా నడిపిస్తున్నారు. ఈ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దానిపై ఘర్షణ కూడా జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫలితంగా మాధురిని చంపాలని నిర్ణయించుకున్నాడు సురేష్. దానికి అనుగుణంగా వారం రోజుల నుంచి ప్లాన్ చేశాడు. మాధురి భర్త ప్రసాద్ ఒక ప్రైవేట్ కంపెనీలో బొలెరో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో తరచు నైట్ షిఫ్ట్‌కి వెళ్తున్నాడు. మరోవైపు నిందితుడు సురేష్ కూడా లారీ డ్రైవర్‌గానే పని చేస్తున్నాడు. ఇంట్లో ప్రసాద్ లేని సమయంలో మాధురిని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు సురేష్…
ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో మాధురి కూడా అలెర్ట్ అయింది. ఇంటి మెయిన్ డోర్ తాళం వేసి చుట్టూ తిరిగి.. ఇంటి లోపలికి వెళ్లేది. భర్త లేని సమయంలో అతి జాగ్రత్త తీసుకునేది. ఐనప్పటికీ అర్ధరాత్రి తర్వాత సురేష్ మాధురి ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు. ఇంట్లో మాధురి ఇద్దరు పిల్లలతో సహా నిద్రపోయి ఉంది. ఆ సమయంలో తనతో తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో మాధురి తల పగలగొట్టాడు. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. తల్లి కేకలకు పిల్లలిద్దరూ నిద్రలేచారు. వాళ్లని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. అదే రాడ్‌తో వాళ్ల తలలు కూడా పగలగొట్టాడు. అతి కిరాతకంగా బ్లేడ్లతో శరీర భాగాలపై కట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ మాధురి మొబైల్ ఫోన్ కూడా తీసుకుని వెళ్లిపోయాడు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. మాధురి కాల్ లిస్ట్ కూడా పరిశీలించారు. సురేష్‌ని పాలకొల్లులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలలో సురేష్‌తో పాటు ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి వివాహేతర సంబంధం.. 3 హత్యలకు కారణమైంది. అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా అర్ధాంతరంగా తనువులు చాలించాల్సి వచ్చింది. అతి కిరాతకంగా ప్రవర్తించిన నిందితుడు సురేష్ కనీసం జాలి కూడా లేకుండా పిల్లల్ని చిదిమేశాడు.