Srushti Fertility IVF Scam: సరోగసీ ముసుగులో డాక్టర్ నమ్రత చేసిన రోత పనులు వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించుకుని.. ఒక డాక్టర్‌గా చేయకూడని పనులే చేసింది డాక్టర్ నమ్రత. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే నీచపు గ్యాంగులతో చేతులు కలిపింది. తుచ్ఛమైన డబ్బు కోసం డాక్టర్ నమ్రత చేయని పని లేదంటే.. అతిశయోక్తి కాదు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో ఆస్పత్రి ఏర్పాటు చేసిన డాక్టర్ నమ్రత.. తన నీచపు పనుల కోసం దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ విస్తరించుకుంది. దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల నుంచి సృష్టి అక్రమ దందా నడుస్తోందని తెలిసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు..
READ MORE: Nimmala Ramanaidu: జగన్ వ్యాఖ్యలకు కౌంటర్.. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా..!
ఇక చైల్డ్ ట్రాఫికింగ్ దందా చేస్తున్న సృష్టి వెనకాల అహ్మదాబాద్ చెందిన డోక్లా గ్యాంగ్ కూడా ఉందని చెబుతున్నారు పోలీసులు. ఈ డోక్లా గ్యాంగ్ పలుమార్లు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు పిల్లలను తీసుకు వచ్చి ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. అంతే కాదు డోక్లా గ్యాంగ్‌లోని కీలక సూత్రధారులతో డాక్టర్ నమ్రతాకు పూర్తిస్థాయిలో లింక్స్ ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. దీంతో సృష్టికి సంబంధించి దేశవ్యాప్త నెట్‌వర్క్‌పైన పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో అరెస్ట్ అయిన డోక్లా గ్యాంగ్ లోని నలుగురు కిడ్నాపర్లను కూడా హైదరాబాద్‌కు తీసుకు వచ్చి విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.. అహ్మదాబాద్‌లో ఉన్న డొక్లా నుంచి ఐదుగురు చిన్నారులను కిడ్నాప్ చేసి, విక్రయించిన మనీషా సోలంకి గ్యాంగ్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని ఖేదా ప్రాంతానికి చెందిన మనీషా సోలంకి డొక్లాలో స్థిరపడింది. అలాగే డొక్లాకే చెందిన బినాల్ సోలంకి, జయేష్ బెల్దార్, మహేష్ సోలంకి ప్రైవేట్ ఉద్యోగులు. కొన్నేళ్ల క్రితం తన ఉద్యోగం కోల్పోయిన మనీషా బతుకు తెరువు కోసం ఫర్టిలిటీ సెంటర్లకు తన అండాన్ని విక్రయించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆమె గుజరాత్, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో ఉన్న అనేక IVF కేంద్రాలకు వచ్చింది. ఇలా తనకు ఏర్పడిన పరిచయాలతో శిశువులకు ఉన్న డిమాండ్ తెలుసుకుంది. మిగిలిన ముగ్గురితో కలిపి ముఠా ఏర్పాటు చేసింది మనీషా. ఆ తర్వాత తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గమంటూ శిశువుల అక్రమ రవాణాకు తెరలేపారు…
READ MORE: Dark Circles Natural Remedies: నల్లటి వలయాలు వేధిస్తున్నాయా?.. ఈ చిట్కాలు పాటించండి!
ఏడాది లోపు వయస్సు ఉన్న శిశువులే ఈ ముఠా టార్గెట్. అలా అపహరించి సంతాన లేమితో బాధపడుతున్న వారితో పాటు ఐవీఎఫ్, ఫర్టిలిటీ సెంటర్లకు విక్రయించడం మొదలెట్టారు. దీనికోసం వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది ఈ గ్యాంగ్. ప్రధానంగా ఫుట్‌పాత్‌పై జీవించే వారి నుంచి వీళ్లు శిశువుల్ని అపహకరిస్తున్నారు. తమ పిల్లల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు పోలీసుల వరకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో వీరి వ్యవహారాలు నిరాటంకంగా సాగిపోయాయి. ఈ గ్యాంగ్ ఇటీవల డొక్లా ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై జీవించే ఓ జంట నుంచి 7 నెలల పసికందును అపహరింది. ఈ భార్యభర్తలు పోలీసులను సంప్రదించడంతో తొలిసారిగా కేసు నమోదు కావడంతో డొక్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలితో ఉన్న సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో దర్యాప్తు మొదలు పెట్టిన అక్కడి క్రైమ్ బ్రాంచ్ అధికారులు మహారాష్ట్ర వరకు వెళ్లారు. అక్కడి ఛత్రపతి శంభాజీనగర్‌లో తలదాచుకున్న నలుగురునీ అరెస్టు చేశారు.. ఈ గ్యాంగ్.. హైదరాబాద్‌లోనూ ముగ్గురు శిశువులను విక్రయించినట్లు గుర్తించారు పోలీసులు. డొక్లాలో అపహరించిన శిశువును సిద్ధాంత్ జగ్‌పత్ అనే వ్యక్తికి రూ. 3 లక్షలకు విక్రయించినట్లు వీళ్లు అంగీకరించారు. దీంతో అతడిని అరెస్టు చేసి శిశువును రెస్క్యూ చేశారు. మనీషా నేతృత్వంలోని ముఠాను డొక్లా తరలించి లోతుగా విచారించారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఇప్పటి వరకు మొత్తం ఐదుగురిని అపహకరించినట్లు వెలుగులోకి వచ్చింది. మిగిలిన నలుగురు శిశువుల్లో ముగ్గురిని హైదరాబాద్‌లోని ఓ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా, ఒకరిని ముంబైలో విక్రయించినట్లు బయటపెట్టారు. ఇటీవలే యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం వెలుగులోకి రావడంతో డొక్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ గ్యాంగ్ కూడా వీరి ద్వారానే ముగ్గురు శిశువుల్ని విక్రయించిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యూనివర్శల్ సృష్టి ఫెర్టిలిటీ కేసులో గోపాలపురం పోలీసులు మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేసిన నందిని, ఆర్.హర్షలతో పాటు మరో నిందితుడిని కటకటాల్లోకి పంపారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 13కు చేరింది. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్న డాక్టర్ నమ్రతతో పాటు కళ్యాణి, సంతోషిలను వివిధ కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు.