సైబర్ నేరస్థులు పంథా మార్చి ప్రజలను వంచిస్తున్నారు. మెట్రోనగరాలతో పాటు అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి ఫోన్ నంబర్లు తెలుసుకుని వారిని తమ వాట్సాప్ బృందాల్లోకి చేర్చుకుంటున్నారు. లక్షల్లో లాభాలొస్తాయని నమ్మిస్తున్న అక్రమార్కులు వాటిని బాధితులు తీసుకున్నాక లక్షలు కొల్లగొడుతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది.
క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ అడ్వొకేట్‌తో పాటు మరో వ్యక్తిని మోసం చేసి రూ.65 లక్షలు కాజేశారు. హైదరాబాద్ వారసిగూడ చెందిన ఓ అడ్వొకేట్‌ను సైబర్ చీటర్స్ వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అనంతరం క్రిప్టో ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట కొంత పెట్టుబడి పెట్టిన అడ్వకేట్‌కు చీటర్స్ లాభాలు చూపించారు. పూర్తిగా నమ్మిన అడ్వకేట్ నుంచి విడతల వారీగా.. రూ.55 లక్షలు కాజేశారు. ఇదే తరహాలో హైదరాబాద్ హిమాయత్ నగర్‌కి చెందిన శ్రీనివాస్ వద్ద.. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.10 లక్షల మోసం చేశారు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఎలా మోసం చేస్తున్నారంటే: క్రిప్టోకరెన్సీ అర్థం వచ్చేలా మూడువేల మంది సభ్యులతో వాట్సాప్ గ్రూప్‌లను రూపొందిస్తున్నారు. నేరస్థులు, వారి అనుచరులు వాట్సాప్ చాట్‌ల ద్వారా క్రిప్టోకరెన్సీ కొంటే రోజూ లాభం వస్తుందటూ సంభాషిస్తారు. బిట్‌కాయిన్ లావాదేవీల చిత్రాలను పోస్ట్‌చేసి ఇతరుల్ని ఆకర్షిస్తారు. ఇదేదో బాగుందనుకుని వాట్సాప్ బృందాల్లో సభ్యులు తామూ కొంటామని చెబుతున్నారు. అప్పుడు అసలు కథను సైబర్ నేరస్థులు ప్రారంభిస్తున్నారు. బిట్‌కాయిన్ క్రయవిక్రయాలకు యాప్‌లు ఉండాలని చెబుతున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి పేరిట ఓ డిజిటల్ ఖాతాను సైబర్ నేరస్థులు ప్రారంభిస్తున్నారు. ఈ డిజిటల్ ఖాతా నియంత్రణ అంతా నేరస్థుల చేతుల్లోనే ఉంటుంది. బిట్‌కాయిన్ పేరిట వచ్చే ఫోన్లకు ఆకర్షితులు కావొద్దని క్రిప్టో కరెన్సీ పేరుతో ఉన్న వాట్సాప్ బృందాల్లో చేర్చితే వెంటనే బయటకు రావాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.