Merchant Navy Officer Murder: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణ హత్య సంచలనంగా మారింది. లవర్ సాయంతో సౌరభ్ రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి(27) దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగింది. అమెరికాకు చెందిన ఒక కంపెనీలో మర్చంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ గత నెలలో తన ఆరేళ్ల కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియా వచ్చారు. మార్చి 4న అతడి భార్య ముస్కాన్‌ని సర్‌ఫ్రైజ్ చేద్దామని వచ్చే సరికి, ఆమె తన లవర్‌లో సాహిల్ శుక్లా(25)తో కలిసి ఉండటాన్ని చూశాడు. దీంతో గొడవ ప్రారంభమైంది. భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రేమికుడు ఇద్దరూ కలిసి సౌరభ్ రాజ్‌పుత్‌ని దారుణంగా పొడిచి హత్య చేశారు. అతడి శరీరాన్ని 15 ముక్కలు చేసి, ప్లాస్టిక్ డ్రమ్‌లో సిమెంట్‌తో మూసేశారు.
హత్య జరిగిన తర్వాత, ముస్కాన్ తన లవర్‌తో కలిసి మనాలికి వెళ్లింది. ఇతరులకు అనుమానం రాకుండా, భర్త సౌరభ్ ఫోన్ ఉపయోగించి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. అయితే, మార్చి 4న సౌరభ్ మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ తర్వాత, ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించింది.
Read Also: IPL 2025: ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
నిజానికి, ముస్కాన్, సౌరభ్ ప్రేమించి, పెద్దలను ఎదురించి 2019లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వృత్తిరీత్యా సౌరభ్ లండన్ వెళ్లిపోయాడు. ఆ సమయంలో పరిచయమైన సాహిల్ అనే యువకుడితో మస్కాన్ ప్రేమలో పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్‌ని అత్యంత దారుణంగా హత్య చేయడం సంచలనంగా మారింది.
మా కూతురిని ఉరితీయాలి: ముస్కాన్ పేరెంట్స్..
అయితే, ఈ కేసులో ముస్కాన్ తల్లిదండ్రులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్కాన్ తల్లిదండ్రులు ప్రమోద్ కుమార్ రస్తోగి, కవిత రస్తోగి ఇద్దరూ కూడా కూతురి దారుణంపై మాట్లాడారు. ఆమెను అమితంగా ప్రేమించిన తమ అల్లుడు సౌరభ్ ని హత్య చేసినందుకు ఆమెకు కఠిన శిక్ష విధించాలని కోరారు. కూతురికి ఎలాంటి మద్దతు ఇవ్వకుండా, తాము సౌరభ్ కుటుంబంతో దృఢంగా నిలబడుతామని చెప్పారు.
మనాలి నుంచి వచ్చిన తర్వాత ‘‘ సౌరభ్‌ను తానే చంపానని ఆమె ఒప్పుకుంది మరియు మేము వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాము. ‘అమ్మా, మేము సౌరభ్‌ను చంపాము’ అని ఆమె మాకు చెప్పింది’’ అని ఆమె తల్లి కవిత రస్తోగి చెప్పారు. సౌరభ్ ముస్కాన్‌ని గుడ్డిగా ప్రేమించారని, మా కూతురే సమస్య అని, అతడిని కుటుంబం నుంచి వేరు చేసి, ఇప్పుడు ఇలా చేసిందని అన్నారు. ఆమెను ఉరితీయాలి, ఆమెకు జీవించే హక్కు లేదని ముస్కాన్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ముస్కాన్, సాహిల్ డ్రగ్స్‌కి బానిసయ్యారని, సౌరభ్ వారి సంబంధాన్ని వ్యతిరేకించడంతోనే చంపేశారని ముస్కాన్ పేరెంట్స్ పేర్కొన్నారు.