Medical College Scam: నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాల పేరిట ఘరానా మోసం వెలుగు చూసింది. మెడికల్ కళాశాలలో భాగస్వామ్యం పేరిట అత్యాశకు వెళ్లి పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ వైద్యులు.. లబోదిబోమంటున్నారు. సదరు మెడికల్ కళాశాలకు MNC అనుమతి నిరాకరించడంతో.. ఈ మోసం వెలుగు చూసింది. వైద్యులు పెట్టిన డబ్బులు బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మెడికల్ కళాశాలలో ఉద్యోగం దొరకిందని సంబర పడ్డ వివిధ విభాగాల ఉద్యోగులు రెండు నెలలుగా జీతాలు లేక ఆందోళనకు దిగుతున్నారు.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి శివారులో క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఉంది. 20 ఏళ్ల క్రితం ఎంతో పేరున్న ఈ మెడికల్ కళాశాల చాలా ఏళ్లుగా మూతపడింది. తాజాగా ఈ మెడికల్ కళాశాలను పునః ప్రారంభించేందుకు.. హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్స్ ఆండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ.. సీఎస్ఐ మెదక్ మెడికల్ ట్రస్టుతో ఒప్పందం కుదుర్చుకుంది.
Crime News: మేనత్తతో అల్లుడు వివాహేతర బంధం.. మామ మందలించడంతో దారుణం!
క్రిస్టియన్ మెడికల్ కళాశాలను 27 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని MOU చేసుకుంది. కర్ణాటకకు చెందిన షణ్ముక మహాలింగం ఛైర్మన్‌గా ఇద్దరు డైరెక్టర్లు మెడికల్ కళాశాల పునః ప్రారంభం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మౌలిక వసతులు, వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించారు. డైరెక్టర్ పదవి కావాలంటూ నిజామాబాద్‌కి చెందిన ఓ వైద్యుడు 5 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్దపడ్డాడు. ఈ మేరకు చెక్కులను ఛైర్మన్ షణ్ముక మహాలింగంకు అందచేశారు. ఆ చెక్కులు బౌన్స్ కావడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది.
ఐతే ఆ పాటికే ఆ వైద్యుడు మరో 26 మంది వైద్యుల నుంచి పెట్టుబడుల పేరిట సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తన పేరిట ఉద్యోగులకు నియామక పత్రాలను సైతం అందచేశారు. సెక్యూరిటీ నుంచి ఇతర విభాగాలకు సిబ్బందిని నియామకం చేసి.. నెల పాటు జీతాలు చెల్లించిన నిర్వాహకులు.. ఆ తరువాత జీతాలు చెల్లించకపోవడంతో ఇటీవల ఆందోళనకు దిగారు. ఛైర్మన్ షణ్ముక మహాలింగంను ఘెరావ్ చేశారు. తమకు నియామకం చేసిన డాక్టర్ జీతాలు చెల్లించడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు బాధితులు.
క్రిస్టియన్ మెడికల్ కళాశాల పునః ప్రారంభం కోసం నిర్వాహకులు దరఖాస్తు చేసుకోగా..మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టింది. మెడికల్ కళాశాలలో వైద్యులు, సిబ్బంది, సరైన వసతులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతులు ఇచ్చేందుకు MCI నిరాకరించింది. దీంతో పెట్టుబడి పెట్టిన వైద్యులతో పాటు జీతాల వచ్చాయని సంతోష పడ్డ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.
Wedding Drama: మొదటి భార్య కంప్లెయింట్.. నిత్య పెళ్లి కొడుకు బండారం బట్ట బయలు!
రెండు నెలలుగా జీతాలు లేక తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఇక ప్రైవేట్ వైద్యులు పెట్టుబడిగా పెట్టిన తమ 20 కోట్ల రూపాయలు ఎలా వసూలు చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పెట్టిన సొమ్మంతా బ్లాక్ మనీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేక.. డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలియక మిన్నకుండిపోయారు. డైరెక్టర్ పదవి ఇప్పిస్తానంటూ.. 2.20 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి మోసం చేశారంటూ.. డాక్టర్ అజ్జ శ్రీనివాస్ డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత వైద్యుని ఫిర్యాదు మేరకు… ఛైర్మన్ షణ్ముక మహాలింగంపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు డిచ్ పల్లి పోలీసులు తెలిపారు.
క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో 150 మెడికల్ సీట్లు కోసం నిర్వాహకులు మరోసారి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐతే భాగస్వామ్యం పేరిట సేకరించిన పెట్టుబడుల విషయం ఇప్పుడు రచ్చగా మారింది. పెట్టుబడులు సేకరించింది ఎవరు?.. ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడింది ఎవరు? అన్నది విచారణలో తేలనుంది. మొత్తం మీద.. సీఎంసీ పునః ప్రారంభం రాష్ట్ర స్థాయిలో కలకలం సృష్టిస్తోంది.