భర్తతో దూరంగా ఉంటోన్న ఓ మహిళ.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎప్పట్లాగే ఆ వ్యక్తి శుక్రవారం రాత్రి ఆమె ఇంటికెళ్ళి, కాసేపయ్యాక వెళ్ళిపోయాడు. అయితే.. ఉదయాన్నే లేచి చూస్తే, ఆ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నెల్లూరు జిల్లా రామచంద్రపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. శనివారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బాలాజీనగర్‌లోని చీపురుకట్ట సంఘానికి చెందిన సంపూర్ణ అనే మహిళ 11 ఏళ్ళ క్రితం అందే ప్రాంతాలో టీ మాస్టర్‌గా పని చేస్తోన్న వేణుని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు వీరి దాంపత్య జీవితం సుఖంగానే సాగింది. వీరికి సంజన, జయశ్రీ అనే కుమార్తులు కూడా ఉన్నారు. అయితే.. మనస్పర్థల కారణంగా ఈ దంపతులు మూడేళ్ళ క్రితమే విడిపోయారు. అప్పట్నుంచి సంపూర్ణ ఓ పెట్రోల్ బంక్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేస్తూ.. తన ఇద్దరు పిల్లిలతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే సంపూర్ణకు ఆటోడ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఎప్పట్లాగే శుక్రవారం రాత్రి సంపూర్ణ ఇంటికి వచ్చిన ఆ ఆటోడ్రైవర్, కాసేపయ్యాక వెళ్ళిపోయాడు. శనివారం ఉదయం సంపూర్ణ ఎంతసేపటికీ నిద్ర లేవలేదు. కుమార్తెలిద్దరూ అమ్మమ్మకు సమాచారమివ్వగా.. ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకొని, సంపూర్ణను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరీక్షించిన వైద్యులు, అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి మెడపై చిన్నపాటి గాయం ఉండడాన్ని గమనించారు. దీంతో.. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.