Woman Kills Daughter: భాష అంటే అభిమానం ఉండాలి, కానీ అది ఉన్మాదంగా మారకూడదు. ఇటీవల కాలంలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడకుంటే దాడులు జరిగిన సంఘటనలు జరిగాయి. అయితే, తాజాగా జరిగిన ఘటన మాత్రం భాషోన్మాదానికి పరాకాష్ట. ఒక మహిళ తన ఆరేళ్ల కూతురు సరిగ్గా మరాఠీ మాట్లాడలేదనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గొంతునులిమి హత్యకు పాల్పడింది. సుదీర్ఘ విచారణ తర్వాత, ఆ మహిళ పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది.
మహిళకు కుమారుడు కాకుండా కుమార్తె పుట్టిందనే అసంతృప్తి ఉందని, అలాగే ఇతర మానసిక సమస్యల కారణంగా మానసిక చికిత్స తీసుకుంటుదని అధికారులు తెలిపారు. నవీ ముంబైలోని కలంబోలిలో నివసించే 30 ఏళ్ల ఆ మహిళ, కుమార్తె హత్యను గుండెపోటుగా చిత్రీకరించాలని చూసింది. కానీ, అనుమానించిన పోలీసులు విచారణలో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Gold and Silver Prices: పసిడి, వెండి ధరలు పెరగడానికి అసలు కారణం ఏంటి..? ఇంకా ఎంత పెరగొచ్చు…?
మంగళవారం తన కుమార్తెను హత్య చేసిందని అధికారులు తెలిపారు. అదే రోజు బాలిక అమ్మమ్మ కూడా ఇంటికి వచ్చింది, కానీ మనవరాలిని కలవలేకపోవడంతో తిరిగి వెళ్లింది. సాయంత్రం మహిళ భర్త కుమార్తె స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తన కుమార్తె గుండెపోటుతో మరనించినట్లు చెప్పింది. అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నిర్వహించడంతో గొంతు నులిమి చంపినట్లు తేలింది. ఆరుగంటల పాటు విచారించిన తర్వాత తన కుమార్తెను హత్య చేసినట్లు మహిళ ఒప్పుకుంది.
చిన్నప్పటి నుంచి బాలికకు మాట్లాడటంలో ఇబ్బందులు ఉండేవని, ఆమె మరాఠీకి బదులుగా ఎక్కువగా హిందీ మాట్లాడేదని, అది ఆమె తల్లికి కోపం తెప్పించేదని అధికారులు చెప్పారు. “నాకు ఇలాంటి బిడ్డ వద్దు; ఆమె సరిగ్గా మాట్లాడదు,” అని ఆమె తన భర్తతో పదే పదే చెప్పేదని, అతను ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నించే వాడని వెల్లడించారు. మహిళకు అబ్బాయి కావాలని ఉండేదని, అమ్మాయి పుట్టడంతో అసంతృప్తిగా ఉందని అధికారులు తెలిపారు.