Mother Killed Her Son For Extramarital Affair In Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. కన్నకొడుకునే కడతేర్చింది ఓ కసాయి తల్లి. ఆ వివరాల్లోకి వెళ్తే.. హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన పాపయ్యకు 30 ఏళ్ల కిందట దాయమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, వెంకటేశ్ (29) అనే కుమారుడు ఉన్నారు. అనారోగ్యం కారణంగా దాయమ్మ భర్త పదేళ్ల కిందటే మృతి చెందాడు.
కట్ చేస్తే.. కొన్నాళ్ల క్రితం దాయమ్మకి అదే గ్రామానికి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే దాయమ్మ ఇంటికి శ్రీనివాస్ వచ్చి వెళ్తుండేవాడు. తల్లి వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న వెంకటేశ్.. తమ ఇంటికి మరోసారి రావొద్దని శ్రీనివాస్‌ని తీవ్రంగా హెచ్చరించాడు. అటు తల్లితో కూడా గొడవ పడ్డాడు. ఇలా నిత్యం గొడవపడుతుండడంతో.. వెంకటేశ్ అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాస్, దాయమ్మ నిర్ణయించుకున్నారు. రాత్రి నిద్రలో జారుకున్నాక.. కొట్టి చంపాలని ప్లాన్ వేసుకున్నారు.
మంగళవారం రాత్రి వెంకటేశ్ మద్యం తాగొచ్చి, ఇంట్లో నిద్రపోయాడు. అతడు మత్తులో ఉండటంతో.. ఇదే సరైన సమయమని భావించి శ్రీనివాస్, దాయమ్మ కలిసి అతని తలపై కర్రతో బలంగా కొట్టాడు. శ్రీనివాస్ అల్లుడు నర్సింహులు కూడా ఈ హత్యకు సహకరించాడు. వెంకటేశ్ చనిపోయాక.. అతని మృతదేహాన్ని ఇంటికి సమీపంలో ఉన్న నీళ్లలో పడేశారు. బుధవారం తన కొడుకు కనిపించడం లేదంటూ దాయమ్మ స్థానికుల ముందు కంటతడి పెట్టగా.. వెంకటేశ్ ఆచూకీ కోసం స్థానికులు వెతకడం ప్రారంభించాడు.
అప్పుడు సమయం చూసుకొని.. దాయమ్మ అక్కడి నుంచి చెక్కేసింది. గ్రామం విడిచి వెళ్లిపోయింది. శ్రీనివాస్, నర్సింహులు కూడా అప్పటికే గ్రామం వదిలి పారిపోయారు. వెంకటేశ్ మృతదేహం కనిపించిన తర్వాత.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దాయమ్మ తన వివాహేతర సంబంధం కోసం కొడుకుని చంపేసిందని తేల్చారు. ప్రస్తుతం దాయమ్మ, శ్రీనివాస్, నర్సింహులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.