Married Woman Killed Husband For Extramarital Affair In Bangalore: కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి.. తమ పచ్చని కాపురాల్ని కూల్చుకుంటున్నారు. హంతకులుగా కూడా అవతారం ఎత్తుతున్నారు. జీవితాంతం తోడుంటానని ఏడడుగులు నడిచిన భార్యలే.. మరో వ్యక్తి కోసం తమ భర్తల్ని అంతమొందిస్తున్నారు. తాజాగా మరో మహిళ ఇలాంటి దారుణానికే ఒడిగట్టింది. తన సంతోషానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తని చంపింది. తను చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు.. ఏవేవో డ్రామాలు ఆడింది. చివరికి ఆమె ఆడిన నాటకాలన్నీ బెడిసికొట్టడంతో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
రామనగర తాలూకా హోరోహళ్లిలో నివాసముంటున్న కిరణ్(27)కి కొన్నాళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే.. ఆమె యశ్వంత్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకి తెలియకుండా.. తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇంట్లో భర్త లేనప్పుడు.. తన ప్రియుడు యశ్వంత్‌ని ఇంటికి పిలిపించుకొని, తన మోజు తీర్చుకునేది. చివరికి ఒక రోజు తన భార్య గుట్టు కిరణ్‌కి తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతడు నిలదీశాడు. మరోసారి ఆ వ్యక్తితో కలవొద్దని వారించాడు. భర్త ఉన్నంతవరకూ తన మోజు తీరదని అనుకున్న ఆమె.. ఎలాగైనా తన భర్తని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తన ప్రియుడు యశ్వంత్‌కి తెలియజేసింది. దీంతో వాళ్లిద్దరూ కిరణ్‌ని చంపాలని ఒక ప్లాన్ వేసుకున్నారు.
ఇటీవల కిరణ్ రాత్రి ఇంటికి చేరుకొని, భోజనం చేసిన తర్వాత పడుకున్నాడు. భర్త నిద్రలోకి జారుకున్నాక.. అతని భార్య యశ్వంత్‌ని ఇంటికి పిలిచింది. పథకం ప్రకారం.. కిరణ్‌ని చంపేసి, ఒక నిర్మానుష్య ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి వచ్చేశారు. మరుసటి రోజు కిరణ్ శవం లభ్యం కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వారు మృతుడు కిరణ్‌గా గుర్తించారు. అతని భార్యని పిలిపించి ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దాంతో ఆమె నిజం కక్కేసింది. కిరణ్ భార్యని, యశ్వంత్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.