అతడు.. ఆమె.. చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆ ఇద్దరు.. కలిసి చదువుకోవడమే కాదు, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు కూడా! స్నేహితులుగానే మెలుగుతూ వచ్చిన ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో తెలీదు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేరన్న సంగతి గ్రహించి.. తాము ప్రేమలో ఉన్నామని తెలుసుకున్నారు. అతడి కంటే ఆమె రెండేళ్ళు పెద్దది. అయినా, ప్రేమకి వయసుతో సంబంధం ఏముంది? అయితే.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ అమ్మాయికి మరొకరితో వివాహం ఫిక్స్ అయ్యింది. తమ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, వాళ్ళని కాదని పారిపోలేక.. ఇంట్లో వాళ్ళు చూసిన వ్యక్తినే పెళ్ళి చేసుకుంది.
అయినప్పటికీ ప్రియుడ్ని విడిచి ఉండలేకపోయింది. దీంతో, ఇద్దరు మళ్ళీ చాటుమాటుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. భర్త, ఇంట్లో వాళ్ళకు తెలియకుండా, తమ ప్రేమ జీవితాన్ని తిరిగి గడపడం ప్రారంభించారు. అయితే.. ఎంతోకాలం ఈ విషయం దాగి ఉండలేదు. కుటుంబ సభ్యులకు వీరి వ్యవహారం తెలిసిపోయింది. ఫలితంగా.. ఎన్నో గొడవలు జరిగాయి. అప్పట్నుంచి దూరం పెరిగింది. ఆ దూరం వీరిని కలిచివేస్తూ వచ్చింది. ఇక జీవితాంతం ఇంతేనని, ఎప్పుడూ కలుసుకోలేమని తెలుసుకున్న ఈ ప్రేమ జంట.. కనీసం చావులోనైనా ఒకటౌదామని నిర్ణయించుకున్నారు. ఆ మరుక్షణమే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లలో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ నగర్‌కు చెందిన వేణు గోపాల్(24), మచ్చ పూజ (26) స్థానికంగా గోపాల్ నగర్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్ రిసెప్షన్‌లో పని చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో పుట్టి, పెరిగిన ఈ ఇద్దరూ.. ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కొన్నేళ్ళుగా వీళ్ళు ప్రేమలో ఉన్నారు. అయితే.. నాలుగేళ్ళ క్రితమే పూజ పెళ్ళి మేన బావ అజయ్‌తో చేశారు. కానీ.. ఆమె మాత్రం భర్తతో కాకుండా వేణు గోపాల్‌తో తరచు కలుస్తోంది. వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందన్న విషయం తెలియడంతో, కుటుంబ సభ్యుల మధ్య చాలా గొడవలు జరిగాయి. కట్ చేస్తే.. ఈ నెల 15 నుంచి పూజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆ ప్రేమ జంట ఓ చెట్టుకు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఐదు రోజుల క్రితం ఆ జంట ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని, మూడు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని ధర్మారం చౌరస్తాకు బైక్‌పై వచ్చారని విచారణలో తేలింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఇలా సూసైడ్ చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.