ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సీఎం నివాసానికి దగ్గరలో ఓ మహిళ చనిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకున్నారు. తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ, బాధితురాలు తన నుంచి రూ. 60 లక్షలు మోసపోయామని చెప్పింది. పోలీసులు తన మాట వినకపోవడంతో.. తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నదా మహిళ.
లక్నోలోని గౌతమ్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సీఎం నివాసం సమీపంలో ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె దగ్గర ఉన్న బ్యాగులో కిరోసిన్ తో నింపిన బాటిల్ ను తెచ్చుకుని.. తలపై పోసుకుంది. అంటించుకునే సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఆమెను పట్టుకున్నారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్దోయ్‌లోని పిహానీకి చెందిన రోలీ దేవి అనే మహిళ నుంచి హర్దోయ్‌కు చెందిన విక్కీ మిశ్రా లక్నోలో ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. 60 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. తన జీవితాంతం కష్టపడి ఇంటి కోసం దాచుకున్న డబ్బు మొత్తాన్ని తనకిచ్చానని తెలిపింది. అయినప్పటికి ఆమె ఇల్లు రాలేదు.. డబ్బు రాలేదని ఆమె వాపోయింది.
ఇళ్లు రాకపోవడంతో మొదట విక్కీని డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో ఇస్తానని.. తర్వాత తనను బెదిరిస్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. దీనిపై ఆమె పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఎవరూ తన మాట వినలేదని… చివరకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవడానికి లక్నో చేరుకున్నాని వెల్లడించింది. ఈ కేసు గురించి హర్దోయ్ పోలీసులకు సమాచారం అందించామని.. ఇన్‌స్పెక్టర్ రత్నేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.